అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అక్కడ చాలా గ్రామాల్లో ప్రజలు చేయటానికి పనులు లేక బెంగళూరు, కేరళ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. ఆ ప్రాంతం నుంచి హంద్రీనీవా కాలువ పారుతున్నా.. అక్కడి రైతులు చుక్కనీరు కూడా వాడుకోలేకపోతున్నారు. ఉరవకొండ, కూడేరు, బెలుగుప్ప మండలాల్లోని 22 గ్రామాల పంట భూములకు నీరిచ్చే ప్రణాళిక చేసిన ప్రభుత్వం సామాజిక బిందు సేద్య పథకాన్ని ప్రకటించింది.
2017 డిసెంబర్లో 842 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన గుత్తేదారు మెగా ఇంజినీరింగ్, మెటాఫెమ్ కంపెనీలు 19 శాతం పనులు పూర్తిచేశాయి. ఈలోపు ప్రభుత్వం మారటం, 25 శాతం లోపు పనులు జరిగినా.. అన్ని ప్రాజక్టులు నిలిపివేయాలని ఆదేశించటంతో ఈ సామాజిక డ్రిప్ పథకం పనులు నిలిపివేశారు. అప్పటికే కూడేరు మండలంలోని 4 గ్రామాల్లో డ్రిప్ పైపుల ఏర్పాటుతో 40 శాతం పనులు ముగించారు. ఉరవకొండ మండలంలోని 8 గ్రామాలకు సరిపడా పరికరాలు కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచారు. డ్రిప్తో నీరు ఇచ్చి ఉంటే.. పంటలు వేసుకునేవారమని రైతులు చెబుతున్నారు.
హంద్రీనీవా కాలవ నుంచి వచ్చే నీటిని జీడిపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్ జలాశయాల నుంచి ఏటా 1.67 టీఎంసీల నీరు ఎత్తిపోసి డ్రిప్ ద్వారా రైతులకు ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రణాళిక. జలవనరులశాఖ అధికారుల పర్యవేక్షణలో సామాజిక బిందు సేద్యం పథకాన్ని 2019 జూన్ లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని వేగంగా పనులు జరుగుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టును నిలిపివేసింది. ఈ పథకాన్ని అమలు చేయటానికి నిర్మించిన పంప్ హౌస్లు మందుబాబులకు అడ్డాలుగా మారిపోయి, శిధిలావస్థకు చేరుకుంటున్నాయి.
రైతుల పంట భూముల్లో పరిచిన పైపులు, ఇతర ఖరీదైన వాల్వులు దొంగలపాలవుతున్నాయి. ఇప్పటికే కూడేరు మండలంలోని కొర్రకోడు, ముద్దలాపురం గ్రామాల్లో పైపులు, వాల్వులు రంపాలతో కోసి దొంగలెత్తుకెళ్లారు. కోట్ల రూపాయల పరికరాలు సిద్ధం చేసుకున్న మెగా ఇంజినీరింగ్, మెటాఫెమ్ కంపెనీలు వాటిని ఎలుకలు, పందికొక్కుల నుంచి రక్షించుకోటానికి ప్రతినెలా లక్షల రూపాయలు వ్యయం చేస్తున్నాయి. బిందు సేద్యంతో నీళ్లిస్తే రెండు పంటలు వేసుకోవచ్చని రైతులు ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా పనులు నిలిచిపోవటంపై 22 గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక బిందు సేద్య పథకం అమలు చేస్తే వేలాది మంది రైతులకు ఒనగూరే ప్రయోజనం ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. కోట్ల రూపాయల విలువచేసే పరికరాలు సిద్ధం చేసుకున్న కంపెనీలు, అనుమతిస్తే ఏడాదిలోపు పనులు పూర్తిచేసి ఫలితాలు చూపిస్తామంటున్నాయి.
ఇదీ చదవండి: ఒక్కో విడతలో 3000- 3500 పంచాయతీలకు ఎన్నికలు