అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో... 137 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశారు. వీరిలో చాలా మంది ఎంసెట్, నీట్‌లతోపాటు, వివిధ విశ్వవిద్యాలయాల డిగ్రీ పోటీపరీక్షలు రాసి ర్యాంకులు సాధించారు. వీరంతా ఇంటర్ మార్కుల జాబితా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో కళాశాలకు చెందిన క్లర్కు జాకీర్ హుసేన్... మార్కుల మెమోలు తీసుకోవటానికి అనంతపురానికి వెళ్లారు. 137 మంది విద్యార్థుల మార్కుల జాబితా తీసుకుని వస్తుండగా... మార్గమధ్యలో వాటిని పోగొట్టుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌కు తెలిపారు. ఈ విషయాన్ని మూడు రోజులుగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియనీయకుండా గోప్యంగా ఉంచారు.
ఘటనపై బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... మెమోలు పోగొట్టుకున్నది అనంతపురంలో కాబట్టి అక్కడ పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోలీసుల సూచనతో అనంతపురం మూడో పట్టణ పోలీసులకు కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలను పరిశీలించి, క్లర్క్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్థరించారు. క్లర్క్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు... తీవ్ర ఆందోళన పడుతున్నారు.
ఇదీ చదవండి: