అనంతపురం జిల్లా కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ గంధం చంద్రుడు కదిరిలో పర్యటించి మండల వనరుల భవనంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కదిరి డీఎస్పీ భవ్య కిషోర్‌తో శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. కదిరి ఆర్డీవో వెంకటరెడ్డి నుంచి నామినేషన్ సరళి గురించి వివరాలు తెలుసుకున్నారు.
నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ మరియు ఇతర ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవోను ఆదేశించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు, ప్రతిపాదించేందుకు వచ్చిన వారితో గ్రామాల్లోని వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైన అధికార యంత్రాంగానికి తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు.
పుట్టపర్తిలో నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కదిరి సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని చోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: 'స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్'