అనంతపురం జిల్లా హిందూపూర్ లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల 250 పడకలున్న పెద్దాసుపత్రి. ప్రతీ విభాగంలో వైద్యులకు కొదవలేదు. కానీ సేవలకు మాత్రం లోటే. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వైద్యం కోసం రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రెండేళ్లుగా ఆసుపత్రిలోని సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేటు సిటీస్కాన్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా రోగులపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యం కోసం 2009లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సిటీ స్కాన్ సేవలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సిటీ స్కాన్ తో అవసరమైన వైద్య సేవలు 2019 వరకు పొందేవారు. 2019లో సిటీ స్కాన్ మిషన్ మరమ్మతులకు గురి కావడంతో.. అప్పటి నుంచి శస్త్రచికిత్సలు, సిటీ స్కాన్ తో అవసరమయ్యే వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని నమ్ముకుని వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది.
సిటీ స్కాన్ మిషన్ మరమ్మతులకు గురై రెండు సంవత్సరాలు దాటిపోయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీ స్కాన్ అవసరమైతే ప్రైవేటులో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు సిటీ స్కాన్ మిషన్ కు మరమ్మత్తులు చేయటం లేదా లేదా కొత్త మిషన్ ఏర్పాటు చేసి వైద్య సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : PROTEST: నీళ్లు, విద్యుత్ కోసం గ్రామస్థుల ఆందోళన