వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, అనంతపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని శింగనమల మండలంలో నియోజకవర్గ తెదేపా నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నష్టపోయామని వేరుశనగ సాగు రైతులు తెదేపా నేతల వద్ద వాపోయారు. అకాల వర్షానికి వేరుశనగ పంట పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో అనంతపురం జిల్లాకు వచ్చి రైతు సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. అలాగే పెద్ద ఎత్తున రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటునే... కర్షకులకు వైకాపా తీవ్ర అన్యాయం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా వచ్చేవి. ప్రస్తుత సర్కార్ వాటిని చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది- కాలువ శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు
మరోవైపు వైకాపా కార్యకర్తలకే పంట నష్టం పరిహారాన్ని ప్రభుత్వం ఇస్తోందని శింగనమల నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ బండారు శ్రావణి ఆరోపించారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందన్నారు.
ఇదీ చదవండి