తీవ్ర పోటీని అధిగమించి ఎన్నో చర్చల తర్వాత రాష్ట్రానికి కియా కార్ల సంస్థను తీసుకొచ్చామని... అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతుందంటే చాలా బాధగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కియా మోటార్స్, తమిళనాడుకు తరలిపోతుందని రాయిటర్స్ సంస్థ ప్రచురించిన కథనంపై చంద్రబాబు స్పందించారు. చర్చలు జరిగినట్టు తమిళనాడు అధికారులు అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు.
మొదటి నుంచీ అభ్యంతరమే
కియా పరిశ్రమ అంశంలో ప్రభుత్వం, వైకాపా నేతలు మొదటి నుంచి అభ్యంతరకరంగానే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ధోరణితోనే అప్పట్లో ఫోక్స్ వ్యాగన్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేమంటూ వెళ్లిపోయిందన్నారు. ఆ కేసులో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కియా సంస్థ పరిస్థితి అలానే ఉందన్నారు.
కథలు చెబుతున్నారు
ఈ అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... కథలు చెబుతున్నారని... నిజాలు దాస్తే.. దాగవని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు వల్ల రూ.20 వేల కోట్ల భారం అవుతుందని మంత్రి చెప్పారని తెలిపారు. కియా సంస్థకు ఇచ్చిన ప్రోత్సాహకాలపై పునఃసమీక్ష చేస్తామన్నారా లేదా అని ప్రశ్నించారు. వైకాపా నాయకులు.. కియా పరిశ్రమ ప్రతినిథులను బెదిరించారని గుర్తు చేశారు. పరిశ్రమలో ఉద్యోగాలు, పనులు తమ వాళ్లకే ఇవ్వాలని అడిగారా లేదా అని నిలదీశారు. కియా వచ్చిన మొదట్లో ప్రజలను రెచ్చగొట్టారని... అయినా తమకు మంచి జరుగుతుందని రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారన్నారు. వైకాపా నేతల వైఖరితోనే కియా యాజమాన్యం పునరాలోచనలో పడిందన్నారు.
ఇవీ చదవండి:
'కియా' ఎక్కడికీ వెళ్లడంలేదు... అన్నీ తప్పుడు కథనాలే: మంత్రి బుగ్గన