Chandrababu Naidu Fire on CM Jagan : సీఎం జగన్ పేదలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో "బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్ని వర్గాలపైనా జగన్ పన్నుల మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి వాటిని లూటీ చేశారని ఆరోపించారు. రైతులతో పాటు అన్ని వర్గాల పొట్టగొట్టిన వైఎస్సార్సీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపును ఇచ్చారు.
Chandrababu Naidu Participated in Babu Surety Future Guarantee Program in Rayadurgam : రాయలు ఏలిన రతనాల సీమ.. రాళ్ల సీమగా మారిందని నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 102 ప్రాజెక్టులు రద్దు చేసి సీమ ద్రోహిగా జగన్ మిగిలారని విమర్శించారు. గోదావరి జలాలను సీమకు తీసుకురావాలని తాను ప్రయత్నిస్తే జగన్ మాత్రం ఎడారిగా మార్చేందుకు ప్రాజెక్టులను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రాయితీతో మైక్రో ఇరిగేషన్ తాను తీసుకొస్తే వ్యవసాయ శాఖను మూసేసి అన్నదాతల జీవితాలతో జగన్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతలు నాలుగు సంవత్సరాలల్లో 40 వేల కోట్ల రూపాయల ఇసుక దోచుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపైనా అప్పుల కుంపటి పెట్టిన జగన్.. లండన్‌లో విహారయాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్యాయాలను ప్రశ్నించే వారందినీ హింసించడం జగన్ సైకో ఇజానికి పరాకాష్టని చంద్రబాబు అన్నారు. పోలీసులు వారికి వత్తాసు పలకడం సరికాదని ఆయన హితువు పలికారు.
ఓటర్లు అప్రమత్తం కండి : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపును ఇచ్చారు. ఎవరి ఓటు ఎప్పుడు గల్లంతు చేస్తారో తెలియదని, ప్రతి ఒటరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఓట్లు ఉంటాయని హాయిగా ఇంట్లో ఉంటే వైసీపీ ఓట్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. అనేక మంది టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కేసులకు భయపడే పార్టీ టీడీపీ కాదని వైసీపీ నాయకులు గుర్తించుకోవాని హెచ్చరించారు.
నేడు, రేపు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ : రాత్రి రాయదుర్గం శివారులోని రాయల్ కాలేజీలో బస చేసిన చంద్రబాబు.. నేడు స్థానికంగా వృత్తి నిపుణులతో సమావేశం (Nara Chandrababu Naidu Schedule) అవుతారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. సాయంత్రం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మండపానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస కల్యాణ మండపం నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి సాయంత్రం 5 గంటలకు గుత్తి పట్టణంలోని తాడిపత్రి సర్కిల్‌కు చేరుకొని బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లికి బయల్దేరి వెళ్తారు.