Chandrababu fire on jagan govt: వైకాపా పాలనలో పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు లేవని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఒకసారి ఆలోచించాలని యువతకు సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదని.. అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నామని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలోనూ ఉందని చెప్పారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా మాత్రమేనని..,తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని అన్నారు.
"వైకాపా పాలనలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా. కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలో ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా. తెదేపా హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలతో అనేకమందికి ఉపాధి కల్పించాం."- చంద్రబాబు, తెదేపా అధినేత
అనంతరం అనంతపురం నుంచి సోమందేపల్లికి చేరుకున్న చంద్రబాబు.. అక్కడ నిర్వహించిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్గమధ్యలో రాప్తాడు, సీకే పల్లిలో ఆగి కార్యకర్తలతో ముచ్చటించారు. రాప్తాడు రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు..తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమందేపల్లి నుంచి శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి చేరుకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో పూలజల్లులతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.
మీటర్లు బిగిస్తే రైతు పరిస్థితి ఏమిటి? : నాడు నందమూరి తారక రామారావు మోటార్లకు మీటర్లను తొలగించారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి బిగిస్తానంటున్నారు. అనంతపురం లాంటి జిల్లాలో వెయ్యి అడుగులు వెళ్తే కాని నీళ్లు రాని పరిస్థితి. అలాంటప్పుడు 20 హెచ్‌పీ మోటార్లు వాడాలి. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే నెలకు రూ.15 వేలు బిల్లు వస్తుంది. వాటిని రైతులు కట్టగలరా? మీటర్లు బిగిస్తే అవి రైతుల పాలిట ఉరితాళ్లు అవుతాయి.మూడేళ్లుగా ఒక్క ఎకరాకైనా బిందు పరికరాలు అందించారా? ఏటా అనంతపురం జిల్లాకే పంట నష్టపరిహారం, పెట్టుబడి రాయితీ పేరుతో రూ.1500 కోట్ల వరకు ఖర్చు చేశాం. కొన్ని సందర్భాల్లో రెండు కలిపి ఇచ్చాం. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చాలనే సంకల్పంతో పెద్ద రైతులకు డ్రిప్ అందించాం. అది రైతులపై మాకున్న చిత్తశుద్ధి. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటనలు తప్ప పని చేయడం లేదు.
మళ్లీ మీరే రావాలంటున్నారు : పది రోజులుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యటించా. మూడేళ్ల వైకాపా పాలనలో ఏం నష్టపోయారో యువతకు అర్థమైంది. అన్ని చోట్ల యువత ఎదురై రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అంతా ఇదే కోరుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా తెదేపాకు ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘నా చుట్టూ కాదని ప్రజల చుట్టూ నేతలు తిరగాలి. రాబోయే ఎన్నికల్లో యువతకే 40శాతం సీట్లు ఇస్తున్నా. ముందుగానే అభ్యర్థులను తప్పకుండా ఎంపిక చేస్తాం. కష్టపడిన వారికే పార్టీలో పదవులు ఇస్తాం. స్వప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ రావాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు...’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి కార్యకర్తలు సహకరించవద్దని హితవు పలికారు.
ఇవీ చూడండి