సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఓ పార్టీ పోలీసులను జైలుకు పంపితే, మరోపార్టీ బెయిల్ ఇచ్చి విడిపించిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా, తెదేపా నాయకులు శవాలమీద రాజకీయాలు చేస్తూ, భాజపాను విమర్శిస్తున్నారని ఆయన అనంతపురంలో విమర్శించారు. సలాం కుటుంబానికి అన్యాయం జరిగిన విషయంలో నిజాయతీగా ఉంటే పోలీసులకు ఎందుకు బెయిల్ ఇప్పించారంటూ విష్ణు ప్రశ్నించారు.
తెదేపా హయాంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి 19 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. ఐదేళ్లలో ఎందుకు నిర్మించలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నిర్మించిన ఇళ్లను వైకాపా ప్రభుత్వం పేదలకు ఎందుకు అప్పగించటంలేదని ప్రశ్నించారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాలు భాజపా ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి మంచిపేరు వస్తుందనే పేదల ఇళ్లను పూర్తి చేయకుండా, చేసినవి అప్పగించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలు ఈ పార్టీలకు వత్తాసుపలుకుతున్నాయని విష్ణువర్దన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్‌కు.. సీఎస్ లేఖ