Houses Demolition in Anantapur: అనంతపురం కలెక్టరేట్ సమీపంలో ఉన్న నేతాజీ నగర్లో ఇళ్ల తొలగింపు వ్యవహారంలో ఆందోళన చోటు చేసుకుంది. నేషనల్ హైవే స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన బాధితులను ఖాళీ చేయించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుధాకర్ అనే వ్యక్తి కుటుంబం ఇంట్లోనే ఉండి గ్యాస్ సిలిండర్లను ఎదురుగా పెట్టుకుని,.. తమ ఇళ్లను కూలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అధికారులు వారికి నచ్చజెప్పారు. స్థానిక ఎమ్మార్వో మరోచోట ఇళ్ల నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు సుధాకర్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దాదాపు గంటపాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అధికారులు బాధితులకు నచ్చజెప్పి ఇళ్లను కూలుస్తున్నారు.
ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటి స్థలానికి దారి కోసమే తమ ఇళ్లను కూలుస్తున్నారని బాధితులు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పదివేలు చెల్లించామన్నారు. మున్సిపాలిటీ అనుమతితోనే ఇల్లు నిర్మించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నపళంగా ఇళ్లను తొలగించడం దారుణమని మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పినా వినకుండా ఇళ్లు కూలుస్తున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆవేదన బాధితులు వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే ఇళ్లను కూలుస్తున్నామని నేషనల్ హైవే డీఈ జగదీష్ గుప్తా తెలిపారు.
ఇవీ చదవండి: