Anantapur District Panch Linga Temple: అరుదైన శిల్ప కళా సంపదను, ఆలయాలను కాపాడుతామని పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు గ్రామ శివారులో ఉన్న పురాతన పంచ లింగ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గతంలో ఎంతో వెలుగు వెలిగి కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని నిరాదరణకు గురై అసాంఘిక కార్యకలాపాలకు నెలువుగా మారిన విషయాన్ని గతంలో ఈనాడు.. ఈటీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం పురావస్తు శాఖ పలు పురాతన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ పంచలింగ ఆలయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వృద్దిలోకి తెస్తాం అని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ పరిశోధకుడు రమేష్తో పాటు రాష్ట్ర సంచాలకురాలు రజిత పరిశీలించారు. ఆలయాన్ని పరిశీలించిన అధికారులు చోళుల కాలంలో నిర్మాణ శైలి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడున్న నంది విగ్రహాలు ఎంతో అపురూపమైనవని.. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ఆలయాన్ని పునరుద్ధరించి శిల్పకళా సంపదను కాపాడేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా పురావస్త శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇక్కడ ఉన్నటువంటి ఈ చోళ, చాణిక్యుల కాలం నాటి అద్భుతమైన శిల్ప కళ, శిల్ప సంపద.. ఇలాంటివి దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు అదే విధంగా కరికాల చోళుడు, చోళ, వీర, పాండ్య రాజులు దక్షిణ భారతదేశంలో పరిపాలించిన సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఐదు లింగాల జ్యోతిర్లింగాన్ని కాపాడి భావితరాలకి అందిస్తాం. కనుమరుగవుతున్న చరిత్రను అందరికీ తెలిసే విధంగా ఈ ఆలయాన్ని కాపాడ వలసిన బాధ్యత ప్రజలకి, ప్రభుత్వానికి అందరికీ ఉంది.- రమేష్, పురావస్తు శాఖ పరిశోధకుడు
ఈ రోజు మలయనూరులోని ఐదు లింగాల దేవాలయంగా పిలవబడుతున్న ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చాం. ఇక్కడ వీటిని చూడగానే చాలా చక్కని శిల్ప సంపద, నిర్మాణ శైలి, చోళ, చాణిక్యుల కాలంలో నిర్మించినట్లుగా భావించ వచ్చు. ఇక్కడ చూస్తే ఆప్పట్లో రాజులు పాలించినట్లుగా ఆధారాలు ఇక్కడ లభ్యమయ్యాయి. అలాగే నంది విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిపై రిపోర్టు రాసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఆలయాన్ని రక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి.- రజిత, పురావస్తు శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు
ఇవీ చదవండి: