Group 4 Applications in Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నెల 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో శనివారం నాటికి మొత్తం 7,41,159 మంది దరఖాస్తు చేశారు. చివరి రెండు రోజులు దరఖాస్తులు పెద్దసంఖ్యలో వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచిస్తోంది. 2018లో గ్రూప్-4 నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి చివరి తేదీ నాటికి ఈ సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలకు చేరువలో ఉండవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అదనంగా చేరిన బీసీ గురుకుల సొసైటీ పోస్టులు: గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా టీఎస్‌పీఎస్సీ చేర్చింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో గ్రూప్-4 సర్వీసుల పరిధిలోకి వచ్చే 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో ఇపుడున్న 8039 పోస్టులకు అదనంగా 141 ఉద్యోగాలు చేర్చుతూ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన 19/2022కు అనుబంధాన్ని జారీ చేసింది.
ఈ పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-4లో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో బాలుర విద్యాలయాల్లో 86 పోస్టులు, బాలికల విద్యాలయాల్లో 55 పోస్టులు ఉన్నాయి. గురుకుల బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హతగా అనుబంధంలో పేర్కొంది. ఇప్పటికే గ్రూప్-4 కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసినట్లు పరిగణిస్తామని కమిషన్ వెల్లడించింది.
ఇవీ చదవండి: