రెక్కలుముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నకు చివరకు కన్నీరే మిగులుతోంది. ధరల పతనంతో కొనేవారు లేక.. పెట్టుబడి సైతం చేతికందక టన్నుల కొద్దీ టమోటాలను రహదారి పక్కన పారబోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం నుంచి అత్యధికంగా మదనపల్లి, ములకలచెరువు మార్కెట్లకు రోజుకు వంద టన్నులకుపైగా ఎగుమతి జరుగుతుంది. జులై, ఆగస్టులో 30 కిలోల బాక్సు ధర రూ.300 వరకు పలకగా.. ఈ నెలలో వర్షాలు అధికంగా కురవడంతో ధరలు అమాంతం తగ్గిపోయాయి. సోమవారం బాక్సు ధర రూ.60కి పడిపోయింది. అంటే కిలో రూ.2 మాత్రమే.
కనీసం రవాణా ఛార్జీలు కూడా దక్కకపోవడంతో ఆవేదనతో 10 టన్నులకు పైగా టమోటాను రోడ్డుపక్కన పారబోశారు. మరోవైపు కడప జిల్లా లింగాల మండలం ఎగువపల్లెకు చెందిన రైతు కిష్టిపాటి గంగిరెడ్డి రెండు ఎకరాల పొలంలో రూ.లక్ష పెట్టుబడితో టమోటా సాగు చేశారు. సోమవారం అంబకపల్లె మార్కెట్‌కు తరలించగా.. వ్యాపారులు కాయలు నాణ్యంగా లేవని దాదాపు 2500 కిలోల టమోటాలను రూ.3 వేలకు అడగడంతో ఆ రైతు ఆవేదనకు గురయ్యాడు. ఆ డబ్బులు కూలీలకు కూడా సరిపోవని రోడ్డు పక్కన పడేశారు.
ఇదీ చూడండి: RAINS LIVE UPDATES: రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి