మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది అనంత రైతుల పరిస్థితి. అధిక వర్షాలు, తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందకుండా పోతోంది. జిల్లాలో పంటల బీమాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఉరవకొండ మండలం ఇంద్రావతి, రాకెట్ల, చినముష్టూరు గ్రామాల్లో ఒకే రైతు పేరు మూడుచోట్ల నమోదైంది. అదే మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన మరో రైతు 13 ఎకరాల్లో పంట నష్టపోయినా జాబితాలో పేరు లేదు. అమడగూరు మండలంలో ఎక్కువ నష్టపోయిన రైతుకు తక్కువ పరిహారం, తక్కువ నష్టపోయిన రైతుకు ఎక్కువ పరిహారం జమైంది. ఇలాంటివి జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో బాధిత రైతుల్లో ఆందోళన మొదలైంది. పెట్టుబడి రాయితీ కోసం అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపైనా విమర్శలు వస్తున్నాయి. నివర్ తుపాను నష్టాన్ని వ్యవసాయ అధికారులు 36 మండలాలకే పరిమితం చేశారు.
జాబితాలో పేర్లు గల్లంతు:
జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అధికారులు లెక్కించారు. 33 మండలాల పరిధిలో పంట దిగుబడి సాధారణం కంటే తక్కువ వచ్చినట్లు గుర్తించారు. బాధితులకు పెట్టుబడి రాయితీ ద్వారా సాయం అందించడానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే నివర్ తుపాను కారణంగా 36 మండలాల్లో 3,807 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తేల్చారు. మొదట 31 మండలాలను గుర్తించగా.. డిసెంబరులో కురిసిన వర్షాలకు మరో 5 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. ఆయా మండలాల్లో నష్టపోయిన 5,948 మంది రైతులకు రూ.4.50 కోట్ల పరిహారం చెల్లించాలని నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద దాదాపు రూ.361.91 కోట్లు 4,51,736 మంది రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెబుతున్నా.. చాలామంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని నిరసనకు దిగారు.
నష్టం అంచనాలో అధికారుల నిర్లక్ష్యం:
పంట నష్టం నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వ్యవసాయ అధికారులు సేకరించి సమాచారాన్ని ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. పొలాల వద్దకు వెళ్లి రైతుల సమక్షంలో నష్టాన్ని పరిశీలించాలన్నది నిబంధన. చాలాచోట్ల అధికారులు పంటలను పరిశీలించినా జాబితాలో పేర్లు కనిపించలేదు. కొందరు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే నివేదికలు పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అర్హులకు పరిహారం అందకుండా పోతోంది. ఈ ఏడాది అన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది. కానీ అధికారులు మాత్రం 33 మండలాలకే పెట్టుబడి రాయితీని పరిమితం చేశారు. అలాగే నివర్ తుపాను ప్రభావం జిల్లా వ్యాప్తంగా కనిపించినా.. నష్టం జాబితాలో 36 మండలాలకే చోటు దక్కింది. పంటల బీమా పరిహారం జాబితాలోనూ 3 మండలాలకు స్థానం లభించలేదు.
నిబంధనలతో రైతన్నకు తప్పని ఇక్కట్లు:
33 శాతానికి మించి నష్టం జరిగితేనే పరిహారం అందించాలనే నిబంధనతో చాలామంది రైతులు నష్టపోతున్నారు. దీనికితోడు ఈ-క్రాప్‌లో కచ్చితంగా నమోదై ఉండాలి. ఈ-క్రాప్‌లో నమోదు చేయకపోవడంతో పలువురు రైతులకు పరిహారం అందుకుండా పోతోంది. బీమా చెల్లించేందుకు పంటకోత ప్రయోగాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రయోగాల్లో ఒక హెక్టారుకు 450 కిలోల కంటే తక్కువ దిగుబడి వస్తేనే ఆ మండలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వారు ప్రయోగం చేసిన పొలాల్లో 450 కిలోల కంటే ఎక్కువ దిగుబడి వస్తే.. దీన్ని అన్ని పొలాలకు ఆపాదించే పరిస్థితి ఫలితంగా నష్టపోయిన రైతులకు అన్యాయం జరిగింది.
నాకున్న ఏడెకరాల్లో వేరుసెనగ సాగు చేశా. అకాలవర్షాల కారణంగా పంట మొత్తం దెబ్బతింది. పెట్టుబడి మొత్తం నష్టపోయా. వ్యవసాయ అధికారులు పొలాన్ని పరిశీలించి పేరు నమోదు చేసుకుని వెళ్లారు. వారు అడిగినప్పుడల్లా పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు వంటి పత్రాలు ఇచ్చాను. అయినా వాతావరణ పంటల బీమా పథకం జాబితాలో పేరు రాలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జాబితాలో పేరు లేదు.
- రైతు రామాంజనేయులు, మానిరేవు
13 ఎకరాల్లో వేరుసెనగ పంట సాగు చేసి అంతా నష్టపోయాను. నష్టపరిహారం కోసం నమోదు చేసుకున్నప్పటికీ వాతావరణ పంటల బీమా జాబితాలో పేరు లేదు. మా చుట్టు పక్కల పొలాల రైతులందరికీ బీమా డబ్బులు వచ్చాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.
-రైతు వెంకటేశు, ఇంద్రావతి, ఉరవకొండ మండలం
వాతావరణ పంటల బీమా పరిహారానికి సంబంధించి జాబితాలో పేర్లు లేని అర్హులను పరిశీలించి మళ్లీ ప్రతిపాదనలు పంపుతాం. ఈ-క్రాప్, బ్యాంకు రుణాలకు సంబంధించి నమోదు చేసుకోకపోవడం లేదా తప్పుగా నమోదు చేసుకోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిని పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం. మళ్లీ ప్రతిపాదనలు పంపుతాం.
-రామకృష్ణ,అధికారి, జేడీఏ
రైతన్నల ఆగ్రహం:
రాంపురం, కురాకులపల్లి రైతులు ఆగ్రహించారు. గ్రామ సచివాలయాలను మూసేసి నిరసన వ్యక్తం చేశారు. 2019కు సంబంధించి బీమా పరిహారం విషయంలో న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని నిలదీశారు. న్యాయం చేయాలని విన్నవించారు. - రాంపురం, (కంబదూరు)
సచివాలయానికి తాళం:
పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందంటూ కళ్యాణదుర్గం మండలం మానిరేవు రైతులు బుధవారం గ్రామ సచివాలయం వద్ద వేరుసెనగ కట్టెతో నిరసనకు దిగారు. అధికారుల తీరును ఎండగడుతూ సచివాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించారు. 2019 పంటల బీమా జాబితాలో అర్హత కలిగిన రైతుల పేర్లు లేవని మండిపడ్డారు. గ్రామంలో 90 శాతానికి పైగా రైతులకు వాతావరణ బీమా అందకుండా పోయిందన్నారు. ఏవో వెంకట్‌కుమార్ అక్కడికి చేరుకుని, అర్హులకు న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. రైతుల ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. - మానిరేవు (కళ్యాణదుర్గం గ్రామీణం)