లాక్‌డౌన్‌తో వలస కూలీల బతుకులు దుర్భరంగా మరాయి. ఉపాధి లేకపోవటంతో ఆకలి తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కడుపు నింపేందుకు కార్యరూపం దాల్చింది ఆర్డీటీ సంస్థ. అనంతపురం జిల్లాలో ప్రతి రోజూ దాదాపు 8వేల మంది పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించింది. ఈ కార్యక్రమంలో ప్రజలను సైతం భాగస్వాములు చేయాలని నిర్ణయించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కల్పించింది. తోచిన సాయం చేయమని గ్రామీణులను అడిగింది. గుంతకల్లు, వజ్రకరూర్ మండలాల్లోని ప్రజలు ఆర్డీటీ పిలుపునకు విశేషంగా స్పందించారు. ధాన్యం, నిత్యావసర వస్తువులు అందించారు. కరోనా ప్రభావంతో తక్కువ ధరలకే పండించిన పంటను అమ్ముతున్న రైతులు... తమ కష్టాన్ని మరచి వలస కూలీలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రైతుల సాయాన్ని మరవలేమని ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. ఇలాగే అన్ని ప్రాంతాల ప్రజలు ఆర్డీటీ చేపట్టిన ఈ కార్యానికి సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఖరీఫ్‌కు పటిష్ఠ ప్రణాళికతోనే రైతన్నకు దన్ను