Women's concern: తాము స్త్రీనిధి కింద తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించామని.. దానిని చెల్లించలేదని ఆసరా పథకం కింద రుణం తీసుకోకుండా వైకేపీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఉరవకొండలో పలు మహిళా సంఘాలకు చెందిన సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలంటూ సోమవారం ఆ సంఘాలకు చెందిన మహిళలు వైకేపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
వైకేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
అక్కడ మహిళా సంఘాల సభ్యుల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఒకరినొకరు తోసుకున్న ఘటనల్లో ఒకరిద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి వైకేపీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ మహిళలు ఆ కార్యాలయానికి తాళాలు కాసేపు అధికారులను నిర్బంధించారు. దీంతో ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.
అసలు గొడవ ఎందుకు..?
ఉరవకొండలోని చందమామ గ్రామైక్య సంఘంలో 35 సంఘాలు ఉండగా 18 సంఘాలకు సంబంధించి రూ.10.90లక్షలు, గంగా గ్రామైక్య సంఘంలోని 6 సంఘాల్లో రూ. 7 లక్షల వరకు స్త్రీనిధి రుణం పక్కదారి పట్టినట్లు ఇటీవల డీఆర్డీఏ అధికారులు విచారణ ద్వారా తేల్చారు. దానికి ఆనిమేటర్లు, సీవోలను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేశారు. అయితే తాము తీసుకున్న రుణాన్ని మొత్తం తిరిగి చెల్లించామని ఆ సంఘాల సభ్యులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలూ ఉన్నాయన్నారు. అయితే వైకేపీ అధికారులు ఆన్లైన్లో ఆ వివరాలను రుణాన్ని తిరిగి చెల్లించని సంఘాల పేర్లతో నమోదు చేశారని ఆరోపించారు.
ఆధారాలను పరిశీలించని అధికారులు..
తాము రుణం చెల్లించినట్లు ఆధారాలు ఉన్నా, అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మొత్తం ఏ సంఘానికి సమోదు అయ్యిందో కూడా పరిశీలించడానికి సుముఖత చూపడం లేదని వాపోయారు. దీని కారణంగా తాము తీవ్రంగా నష్ట పోతున్నామని తెలిపారు. దీనిని అడ్డుపెట్టుకుని తమకు ఆసరా పథకం కింద రుణమాఫీలో భాగంగా మంజూరైన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసుకోకుండా వైకేపీ అధికారులు ఆంక్షలు విధించారన్నారు. అక్రమాలకు పాల్పడి తమకు నష్టాన్ని కలిగించిన వారితో ఆ మొత్తాన్ని రికవరీ చేయకుండా, ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఏంటని బాధిత మహిళలు తీవ్ర ఆవేదనతో అధికారులపై విరుచుకు పడ్డారు.
సమస్యను పరిష్కరించాలని ఎస్సై సూచన.. అనంతరం విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ హరినాథ్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని విషయం గురించి ఆరా తీశారు. దీనిపై విచారించేలా చూడాలని వైకేపీ అధికారులకు సూచిస్తూ, మహిళలకు సర్ది చెప్పారు. దీంతో పరిస్థితి సద్దు మణిగింది.