అనంతపురం జిల్లా రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అద్దెకు ఇచ్చే కేంద్రాలకు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఏడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు వీరాంజనేయులు తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ప్రధాన కార్యాలయంలో మేనేజర్లతో ఉపకరణాల అద్దె కేంద్రాల స్థాపనపై సమావేశం నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు మిత్ర సంఘాలకు రుణం మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేంద్రాల స్థాపనకు ఆయా సంఘాలు ముందుకొచ్చి రైతులకు వ్యవసాయ రంగంలో చేయూతనందించాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. బ్యాంకు సిబ్బంది సాహసంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కొనియాడారు.
అద్దె ఉపకరణాల కేంద్రాలకు సంబంధించి ఒక్కో కేంద్రానికి రూ.12 నుంచి 15 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇందులో సంఘాల వాటా పది శాతం, 40 శాతం రాయితీ, మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా ఇస్తుందని ఆయన వివరించారు. సంఘానికి సంబంధించి 10 శాతం మూలధనం ముందుగానే బ్యాంకులో ధరావతు చేయాలని సూచించారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించామన్నారు. ఆప్కాబ్ మేనేజరు దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. సహకార సొసైటీల అభివృద్ధికి సంబంధించి ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: భూ వివాదం: కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు