అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నంజమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు ఆకలితో అవస్థలు పడుతోంది. ధర్మవరం పట్టణానికి చెందిన వెంకటరామప్ప... ఆంజనేయ స్వామి ఆలయ నిర్వాహకులు పూజారిగా ఉండేవారు. అతని భార్య నంజమ్మ అక్కడే ఉండేది. వచ్చిన భక్తులకు కట్టెల పొయ్యి మీద అన్నం, పరమాన్నం వండి కడుపునిండా వడ్డించేది. 2 సంవత్సరాల క్రితం భర్త వెంకట రామప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా ఒక కుమార్తె మృతి చెందారు. మరో కుమార్తె వివాహమై వేరే ఊరిలో ఉంటోంది.
అవ్వ ఆకలి కేకలు
భర్త మరణానంతరం ఆలయం వద్దే ఉంటోంది అవ్వ. ఆకలి వేసినప్పుడు రహదారిపై వెళ్లే వాహనదారులను చూసి కేకలు వేస్తోంది. దయాగుణం కలిగిన వారు ఆ అవ్వ బాధ చూసి సాయం చేసేవారు. సమీప బంధువులు అప్పుడప్పుడు వచ్చి కాస్త భోజనం పెట్టి వెళ్తున్నారు. కంటి చూపు మందగించి, నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆదరించే వారు కరవయ్యారు. తనకు కాస్త బువ్వ పెట్టి ఆశ్రయం కల్పిస్తే చాలని దండం పెడుతూ అక్కడికి వచ్చిన వారిని అడుగుతోంది అవ్వ. రోజూ పదుల సంఖ్యలో భక్తులకు భోజనం పెట్టిన ఆమె బుక్కెడు బువ్వ కోసం ప్రాధేయపడుతుంది.
కథనానికి స్పందన
అవ్వ దీనావస్థపై ఈనాడు కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించారు. అవ్వను అనంతపురంలోని సెయింట్ వెన్సన్ డి పాల్ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అవ్వకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: