Tiger: అనకాపల్లి జిల్లాలో గత 15రోజులుగా ఎవరికీ కంటి మీద కునుకు పట్టనీయకుండా తిరుగుతున్న పెద్దపులిని గురువారం రాత్రి అటవీ శాఖాధికారులు గుర్తించారు. దాని కదలికలను ట్రాప్ కెమెరాల్లో బంధించారు. కశింకోట మండలం విస్సన్నపేటలో రైతు గవిరెడ్డి వెంకటరమణకి చెందిన గేదెపెయ్యను బుధవారం పులి చంపిన విషయం తెలిసిందే. మళ్లీ ఆహారం కోసం అక్కడికే తిరిగి వస్తుందని బుధవారం అదే ప్రాంతంలో అధికారులు నాలుగు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వారు ఊహించినట్లే గురువారం రాత్రి సమయంలో పులి వచ్చింది.
శుక్రవారం ఈ కెమెరాల్లో ఉన్న డేటాను అధికారులు పరిశీలించారు. ఇప్పటివరకూ పులి అడుగులు తప్ప పులిని ఎవరూ చూడలేదు. కెమెరాలో రికార్డయిన వీడియోలు, ఫోటోలను పరిశీలించిన జిల్లా అటవీశాఖాధికారి అనంతశంకర్.. పెద్దపులికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పులి వయస్సు ఐదారు సంవత్సరాలు ఉంటుందన్నారు. ఇది రోజుకు పది కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేస్తోందని తెలిపారు.
పాపికొండల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దీన్ని ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిందన్నారు. ఇప్పటివరకూ వదంతులుగా భావించిన వారంతా నిజంగా పులి తిరుగుతోందని తెలుసుకుని కలవరానికి గురయ్యారు. అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ రేంజి అధికారి పి.ఆంజనేయరాజు ఆ ప్రాంతానికి బోనులు తెప్పించారు.
ఇవీ చూడండి: