Arrest in Murder Case: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీ. ఎల్ పురం గ్రామంలో గత నెల 27న జరిగిన దళిత యువకుడు వీర నాగేంద్ర హత్య ఘటనలో మిస్టరీ వీడింది. ఈ దారుణమైన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పీ. ఎల్ పురం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజేష్ అదే గ్రామానికి చెందిన సిద్ధ పద్మ అనే మహిళతో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో పద్మ.. వీర నాగేంద్ర అనే వ్యక్తితో మాట్లాడుతోంది. ఈ విషయం తెలిసిన రాజేష్ ఆమెను అడిగాడు. అయితే నాగేంద్ర తనతో మాట్లాడమంటూ వేధిస్తున్నాడని పద్మ.. రాజేష్‌తో చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న రాజేష్, పద్మ వీరిద్దరూ కలిసి నాగేంద్రను మట్టు పెట్టాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని వెంకటేష్ అనే మరో వ్యక్తితో చెప్పి.. ముగ్గురు కలిసి నాగేంద్ర హత్యకు కుట్ర పన్నారు.
దీనిలో భాగంగా ఫిబ్రవరి నెల 27వ తేదీన అర్ధరాత్రి పద్మ.. నాగేంద్రకి ఫోన్ చేసి.. అతడిని ఇంటికి రమ్మని చెప్పింది. ఇంటికి వచ్చిన నాగేంద్రను.. రాజేష్, వెంకటేష్, పద్మ ముగ్గురూ కలిసి నోరు, ముక్కు మూసివేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి స్కూటీపై తీసుకువెళ్లి నాగేంద్ర పని చేసే పొలం వద్ద ఉన్న బావిలో పడేశారు.
"రాజేష్‌తో వివాహేతరం సంబంధంలో ఉన్న పద్మ.. నాగేంద్రతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఈ విషయాన్ని రాజేష్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నాగేంద్రను హత్య చేయాలని నిర్ణయించుకుని.. అతడిని మట్టు పెట్టారు." - ప్రవీణ్ కుమార్, డీఎస్పీ
మరి కొందరి పాత్ర ఉందని దళిత సంఘాలు ఆరోపణ..
ఈ కేసు విషయంలో మరి కొంతమంది పాత్ర ఉందని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. కొంతమంది భూస్వాములు కావాలనే దళిత యువకుడిని మట్టు పెట్టారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేసి ఆ పెద్దలను అరెస్టు చేయకుంటే కేంద్ర ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని ఆరోపించారు.
"నిందితులకు ఈ హత్యలో వారి కుటుంబాల సహకారం, కుల పెద్దల సహకారం ఉండే ఉంటుంది. ఎవరి మద్దతు లేకుండా నిందితులు ఈ హత్యకు పాల్పడి ఉండరు. పోలీసులు చాలా చాకచక్యంగా తొందరగా ఈ మిస్టరీని ఛేదించారు. అయితే ఈ కేసులో ఇంకా కొన్ని విషయాలు బయటకు రాలేదు. వాటిని కూడా పోలీసులు చేధించాలని కోరుకుంటున్నాను." - బోడపాటి అప్పారావు, దళిత సంఘం నాయకుడు
ఇవీ చదవండి: