Lawsuit filed in High Court on allotment of land for YCP office: అనకాపల్లి జిల్లా, మండలం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాజుపాలెం గ్రామ పరిధిలోని 1.75 ఎకరాల భూమిని.. వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 20న జారీచేసిన 759 జీవోను.. రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కొత్తూరు నర్సింగరావుపేట మాజీ సర్పంచి కసిరెడ్డి సత్యనారాయణ.. మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. రాజుపాలెం సర్వే నంబరు 75/3లోని 1.75 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలు భూమిగా గ్రామీణుల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్దేశించిందిగా పేర్కొన్నారు.
ఆ భూమి ప్రభుత్వానికి చెందదు: గయాలు భూమి ప్రభుత్వానికి చెందదు.. దానిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని అన్నారు. ఆ భూమిని నచ్చిన వారికి లీజుకి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఆ స్థలంలో ప్రాథమిక ఆరోగ్య, అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. రాజుపాలెం గ్రామం.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయ్యింది. సమీప గ్రామాల ప్రజలకు సేవలు అందించే నిమిత్తం ఇటీవల రాజుపాలెంలో ఆసుపత్రి నిర్మించారు. మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కాకముందు ఆ భూమి గ్రామ పంచాయతీ స్వాధీనంలో ఉంది. ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు పలువురు చేసిన యత్నాలను తిప్పికొట్టారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొస్తూ.. వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఏడాదికి ఎకరానికి రూ. వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు నిర్ణయించింది. గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నా, మరో చోట స్థలం కేటాయించేందుకు అవకాశం ఉన్నా.. పట్టించుకోకుండా వైసీపీకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించింది.
మిగిలింది అది మాత్రమే: గ్రామస్థుల సామాజిక అవసరాల కోసం ఆ భూమిని వినియోగించుకునేందుకు ఎప్పటి నుంచో దానిని రక్షించుకుంటున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమి మాత్రమే మిగిలింది. గ్రామ సభ నిర్వహించి ఆ భూమిని రక్షించుకోవాలని తీర్మానం చేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. వైసీపీ పార్టీ కార్యాలయానికి 1.75 ఎకరాల భూమిని కేటాయించారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోను రద్దు చేయాలని.. జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడిని ఆదేశించాలని’ కోరారు. ఈ వ్యాజ్యంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్, తహశీల్దార్, వైసీపీ ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి: