Michaung Cyclone Effect In Crops And Roads In Anakapalli: మిగ్‌జాం తుపాను నేపథ్యంలో కురిస్తున్న భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాలువలో పారాల్సిన మురికి నీరంతా రహదారులపై పారుతుంది. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో డిగ్రీ కళాశాల వద్ద చెట్టు కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వర్షపు నీరు ఎక్కువ అవ్వడంతో మాకవరపాలెంలో పలు నివాస ప్రాంతాల్లోకి నీరు పారింది.
Rain Water Comes In Roads: పట్టణంలోని శారద నగర్, శ్రీ కన్య కూడలి, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాలు జలమయమై మురికి కాలువలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ మురికినీటితో నిండిపోవడంతో స్థానికులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క పట్టణవాసులు ఎటూ వెళ్లలేక రెండు రోజులుగా ఇళ్లల్లోనే ఉంటున్నారు. వర్షాలకు చోడవరంలో కోర్టు అవరణ పూర్తిగా జలమయమైంది. ఇక్కడ తొమ్మిదివ అదనపు జిల్లా కోర్టు నీట మునిగింది. చోడవరంలో రోడ్లపై నీరు పారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి చోడవరంలోని ఎస్సీ బాలికల వసతిగృహం కారుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు వసతిని తాత్కాలికంగా మార్చారు.
ఎడతెరిపిలేని వర్షం, వేల ఎకరాల్లో పంట నష్టం - అన్నదాత ఆందోళన
Cyclone Effect In Two Days In Anakapalli: గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఖరీఫ్ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వరి పంట కోసి కల్లాలకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన వరి పనలు నీటి ముంపునకు గురికావటంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం తదితర ప్రాంతాల్లో పంటలు మునగటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రోలుగుంట మండలంలోని భోగాపురం, అడ్డసరం, పడాలపాలెం వంటి గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Crop Loss In Heavy Rains : నాతవరం మండలానికి చెందిన జనసేన పార్టీ యువకులు తమ ప్రాంతంలో సుమారు 500 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిలిందని, ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకుని నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నాతవరం మండలంలోని ఎర్రవరం, మర్రిపాలెం గ్రామాల్లోని పొలాల్లో తడిసిన వరి పనలను పరిశీలన చేసి వారు రైతులకు సహాయం చేశారు. చోడవరం నియోజకవర్గంలో ఇంటికి చేరాల్సిన వరి పంట నీలపాలైందని టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కె.రాజు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, పెదబాబులు, చోడవరం, అన్నవరం, రేవళ్లు గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులకు రూ.25,000లు పంట నష్ట పరిహారంగా ప్రభుత్వం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.