Tribal Protests: బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చుతూ తీర్మానించడంపై అల్లూరు జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటున్నారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా తీర్మానానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి సైతం పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన ఐకాస ఆదివాసీ సంఘ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చుతూ తీర్మానించడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వైసీపీ స్టిక్కర్ల బ్యాచ్ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నామంటూ.. రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు.ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ చేశారు.
పాడేరు తలారిసింగి వద్ద ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న గిరిజనులను అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్.. స్టిక్కర్ల ఎమ్మెల్యేల బ్యాచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గిరిజన ముసుగులో ఉన్న ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు సహా ఏజెన్సీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామాలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు మరోసారి గిరిజనుల నుంచి నిరసన సెగ తగిలింది. హుకుంపేట మండలంలో "జగనన్నే మా భవిష్యత్ " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఫాల్గుణని గిరిజన సంఘ నాయకులు, ప్రజలు అడ్డగించారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానంపై గిరిజన సంఘ నేతలు ఎమ్మెల్యేను నిలదీశారు. నేను మీ ఆదివాసి ఎమ్మెల్యే అని చెప్పగా సంఘ నేతలు ఎదురు తిరిగారు. మాకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించకండి.. వెంటనే మీరంతా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళను చేస్తున్న గిరిజన నాయకులను పోలీసులు అడ్డుకుని.. ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించేశారు.
గతంలో కూడా పలుమార్లు నిరసనలు: ఎమ్మెల్యే ఫాల్గుణకు గతంలో కూడా పలుమార్లు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్లో పాల్గొన్న ఎమ్మెల్యేను.. తమ సమస్యలు చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు, మంచినీరు, మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గిరిజనులు చెప్పారు. అయితే అప్పట్లో దీనిపై విచిత్రంగా అధికారులు స్పందించారు. కొత్త రాష్టం కాబట్టి నిధులు లేవు.. అయినా సరే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని అధికారులు ఎదురు ప్రశ్నించారు. దీనిపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: