Villagers Panicked by the Series of Deaths: ఆ గ్రామానికి ఏమైందో తెలియదు ఆకస్మికంగా మరణాలు మొదలయ్యాయి. వారంలో ఏడుగురు చనిపోయారు. వరుస మరణాలతో స్థానికులు.. బంధువుల గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. రాత్రులు నిద్రపోవడం లేదు. భయంతో బికుబిక్కుమంటున్నారు. అసలు ఏం జరిగుతుందో తెలియక.. గ్రామస్థులు నిత్యం భయంతో బతుకుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల పెదబయలు మండలం కిండలం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. కిండలం గ్రామంలో సుమారు 300 మంది నివాసం ఉంటున్నారు. వారం కిందట అనారోగ్యంతో వృద్ధురాలు మృతి చెందింది. తర్వాత 4 నెలల చిన్నారితో పాటు 40 - 50 వయసున్న వారు మరో ఐదుగురు చనిపోయారు.
దీనిపై బుధవారం వైద్య శిబిరం కూడా నిర్వహించారు. టెస్టులు కూడా చేశారు. కానీ అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్య సిబ్బంది చెప్పారు. ఇది ఇలా ఉంటే.. అప్పటికే పాడేరు ఆసుపత్రికి తరలించిన ఇద్దరు చికిత్స పొందుతూ ఒకే రోజు మృతి చెందారు. మరొకరు కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు క్షణం క్షణం భయంతో గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎవరిని మృత్యువు ఆవహిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
అంతే కాకుండా.. మృతి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లి వచ్చినవారు కూడా ఇదే లక్షణాలతో బాధ పడుతున్నారు. నరాలు పీకేయడం, గొంతు బిగపట్టినట్టు ఉండడం, గుండె అదిరినట్లు ఉండడం జరుగుతుందని లక్షణాలు వచ్చిన వారు చెప్తున్నారు. చనిపోయిన వారు రమ్మని అంటున్నారని కేకలు పెడుతున్నారు. వింత వింతగా మాట్లాడుతున్నారు. ఒక్క సారిగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జగురుతుందో అని గ్రామస్థులు వణికిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఈ విచిత్ర పరిస్థితి వలన.. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కి కూడా పంపించడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం కొంత మంది గ్రామస్థులు.. గ్రామాన్ని విడిచి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. తమ గ్రామానికి ఏదో కీడు జరిగిందంటూ బిక్కుబిక్కుమంటూ కొందరు కాలం వెళ్లదీస్తున్నారు.
"గత వారం రోజుల నుంచి ఏడుగురు చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారో కూడా మాకు తెలియడం లేదు. ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్తున్నాం.. టెస్టులు కూడా చేస్తున్నారు. కానీ టెస్టుల్లో కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఊర్లో ఉన్న వాళ్లంతా పక్క గ్రామాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు". - గ్రామస్థుడు
"వారం రోజుల నుంచి వరుస మరణాల వలన.. స్కూల్‌కి వచ్చే పిల్లలు కూడా రావడం లేదు. భయంతో తల్లిదండ్రులు వారి పిల్లలను పంపించడం లేదు. మెడికల్ క్యాంప్ పెట్టినా సరే మరణాలు తగ్గక పోవడంతో.. పిల్లలను పక్క గ్రామాలకు తరలిస్తున్నారు".- కోటేశ్వరరావు, ఉపాధ్యాయుడు
ఇవీ చదవండి: