Interim Orders Of High Court To Stop Teacher Transfers: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి.. ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టకుండా కోర్టు స్టే విధించింది. మార్చి 14 వరకు ఎటువంటి పదోన్నతులు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ గత నెలలో జీవోను జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా గత నెల 27 నుంచి మార్చి 19 వరకు ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ను రూపొందించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ.. నాన్ స్పౌజ్ టీచర్ల యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో ప్రభుత్వం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హడావిడిగా.. చట్టాన్ని పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒకే చోట ఉండేందుకు వీలుగా వారికి అదనపు పాయింట్లు అనేవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి సౌకర్యం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు కూడా ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు వర్తింపచేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
అదేవిధంగా గుర్తింపు పొందిన యూనియన్ల ఆఫీస్ బేరర్లకు అదనపు పాయింట్లు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమన్నారు. రాజ్యాంగానికి, తెలంగాణ విద్యా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేసిందని పిటిషనర్ల తరపున... న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదించారు. తెలంగాణ విద్యా చట్టం ప్రకారం నిబంధనలను గవర్నర్ ఖరారు చేయాల్సి ఉంటుందని పిటిషనర్ల వాదన.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల మేరకు గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ అసెంబ్లీ, మంత్రి మండలి, గవర్నర్ అనుమతి లేకుండా అధికారులే నిబంధనలు ఖరారు చేస్తూ.. జీవో ఇచ్చారని వాదించారు. గవర్నర్‌కు కనీసం సమాచారం లేకుండానే జీవో ఇవ్వడం విద్యా చట్టానికి విరుద్ధమని వాదించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాం ధర్మాసనం నెల రోజుల్లో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను మార్చి 14కు వాయిదా వేశారు.
ఇవీ చదవండి: