PPA on polavaram: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులకు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రాజెక్టు అథారిటీ తేల్చింది. దిగువ కాఫర్‌డ్యాంను 2022 జులైలోగా నిర్మించాల్సి ఉన్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పుపట్టింది. అందుకే ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రదేశాన్ని వరద ముంచెత్తిందని వెల్లడించింది. ఇకముందు తలెత్తబోయే ఇతర విపరిణామాలకు దిగువ కాఫర్‌డ్యాం సకాలంలో నిర్మించకపోవడమే ప్రధాన కారణమవుతుందని అప్రమత్తం చేసింది. ప్రాజెక్టు అథారిటీ సూచనలను ప్రభుత్వం మూడేళ్లనుంచి విస్మరిస్తోందంటూ నిలదీసింది.
అథారిటీ అభ్యంతరాలివీ..
పోలవరం నిర్మాణం విషయంలో తమ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి విస్మరిస్తూ వస్తోందని ప్రాజెక్టు అథారిటీ నిలదీసింది. 2019 నవంబర్‌లో కొత్త కాంట్రాక్టు సంస్థకు పోలవరం పని అప్పగించే నాటికి... దిగువ కాఫర్‌డ్యాంలో 22.09 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే మిగిలి ఉంది. 2022 ఏప్రిల్‌లో ప్రాజెక్టుకు కొత్త షెడ్యూలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం 2022 జులై నాటికి దిగువ కాఫర్‌డ్యాం పూర్తి చేయాల్సి ఉంది. జులైలోపు పని పూర్తి చేసేస్తామని పదేపదే జలవనరులశాఖ చెబుతూ వచ్చినా సాధ్యం కాలేదు. దీనిపై ఏప్రిల్ నుంచి జులైలోపు అనేక సార్లు రాష్ట్ర జలవనరుల శాఖను హెచ్చరిస్తూనే ఉన్నట్లు పీపీఏ స్పష్టం చేసింది. ప్రధాన డ్యామ్ పనులకు దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణం అడ్డంకిగా మారుతుందని, వరద ముంచెత్తుతుందని.... త్వరగా పూర్తి చేసుకోవాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్ వివరంగా చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని పీపీఏ తెలిపింది. రాష్ట్ర జలవనరుల శాఖ తీరు చూస్తే... ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా లేదని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాజెక్టు పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్ టూల్‌ను సేకరించి ప్రాజెక్టు, అథారిటీ, ఏపీ జలవనరుల శాఖలో ఏర్పాటుచేయాలని మూడేళ్లకుపైగా చెబుతూనే ఉన్నా.... తమ సూచనలను రాష్ట్ర జలవనరులశాఖ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేసింది.
తాజా సమస్యలేమిటి?
పోలవరం అథారిటీ ఈ స్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కడానికి అనేక కారణాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులో దిగువ, ఎగువ కాఫర్ డ్యామ్‌లు కీలకం. దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేసి ఉంటే... వరద సమయంలోనూ పనులకు వీలుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకపోవడం వల్ల... పనులు చేయాల్సిన కీలక ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. గోదావరిలో సెప్టెంబరు వరకూ వరదలు వస్తూనే ఉంటాయి. అక్టోబరు వరకూ పనులు సాధ్యంకావు. వరదలు తగ్గాక ఆ నీటిని అక్కడి నుంచి తోడివేయడమూ పెద్ద సమస్యే. గతంలో ఉన్న నీటిని ఎత్తి పోయాలంటేనే 2వేల 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ప్రస్తుతం వరదలు తగ్గాక. నీరు మరింత ఎక్కువే ఉంటుంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, పరిష్కారాలకు ఎంత ఖర్చవుతుందో అధ్యయనాలను బట్టి తెలుస్తుంది. దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేసి ఉంటే...ఆ పని నిరాటంకంగా సాగేది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ గుంతలు పడ్డాయి. కొంత ఇసుకతో నింపుతున్నారు. ఇంతలో వరద ముంచెత్తి ఆ పనులకూ ఆటంకం ఏర్పడింది. 2020 వరదల కంటే ముందే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేసుకుని ఉంటే సమస్యలు వచ్చేవి కావు. జులైలో గోదావరికి అనూహ్యంగా వరదలు వచ్చాయని.... జలవనరుల మంత్రి అంబటి రాంబాబు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. గోదావరి వరద రికార్డులను బట్టి... జులైలో వరదలొస్తాయని ఎవరైనా చెబుతారు. ముఖ్యమంత్రి జగన్ సైతం గోదావరికి జులైలో 10లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని 2019లో అసెంబ్లీలోనే చెప్పారు.
ఇవీ చదవండి: