FRO Srinivasa Rao died in attack by podu farmers భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అధికారి ప్రాణాలు బలిగొంది. అటవీ భూములను కాపాడేందుకు ఎదురొడ్డిన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు విధినిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోడుభూముల సాగుదారులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు మంగళవారం ఉదయం పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మొక్కలు తొలగించవద్దని చెప్పే లోపే అక్కడే ఉన్న శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.
గుత్తికోయల దాడిలో రేంజర్ శ్రీనివాసరావు మరణించడం పట్ల అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలు సహించేది లేదన్న మంత్రి.. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ అధికారులు మనోస్థైర్యం కోల్పోవద్దన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో చోటు చేసుకోకుండా చూస్తామని తెలిపారు.
శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎర్రబోడు బెండలపాడు శివారు అటవీ ప్రాంతంలో శ్రీనివాసరావుపై గుత్తి కోయల దాడిని మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్దితో పని చేస్తుంటే... విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు మంత్రి సత్యవతి రాథోడ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ ఆక్రమణలను సహించేది లేదని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
CM KCR on FRO srinivas గుత్తికోయల దాడిలో మరణించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. అటవీ ఆక్రమణలు సహించేది లేదన్న సీఎం... అక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం... దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. మరణించిన ఎఫ్‌ఆర్‌ఓ కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి... డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీవిరమణ వయస్సు వచ్చేదాకా ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: