CM Jagan Tabs Distribution to Govt School Students: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (YS Jagan) విద్యార్థులతో కలిసి డిజిటల్ క్లాస్ రూంలో పాఠాలు విన్నారు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో చింతపల్లి చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
620 కోట్లతో 4 లక్షల 34 వేల మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు పదిరోజుల పాటు అందజేయనున్నట్లు సీఎం వివరించారు. గతేడాది 686 కోట్ల రూపాయిలను ఖర్చుచేసి 5 లక్షల 18 వేల మందికి టాబ్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. తన జన్మదినం రోజునే ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు.
CM YS Jagan Public Meeting at Chintapalli: రాష్ట్రంలో విద్యార్థుల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నంలో భాగమే విద్యలో డిజిటలైజేషన్ అని, అందుకే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా బైజూస్ కంటెంట్‌తో టాబ్ల పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి పైబడిన క్లాస్‌రూమ్‌ను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. ఇప్పటికే 30 వేల తరగతి గదుల్లో ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. జనవరి కల్లా మరో 31 వేల తరగతి గదుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
విద్యార్థులతో కలిసి డిజిటల్ పాఠాలు విన్న సీఎం జగన్
బైజూస్ కంటెంట్ మాత్రమే ఈ టాబ్‌లలో అప్లోడ్ చేసి ఇస్తున్నామని, 33 వేల విలువ చేసే ఈ టాబ్లు పేద కుటుంబాల పిల్లల జీవితాలను మారుస్తాయన్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలబడాలన్న ఉద్దేశంతో ప్రతి క్లాస్ రూం డిజిటలైజ్ చేసే కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. 10 వేలకు పైగా స్మార్ట్ టీవీలు పాఠశాలలకు పంపిణీ చేశామని, అందులో ఐబీ పానెళ్లను అమర్చి, డిజిటలైజ్ చేసే కార్యక్రమం జనవరి 30వ తేదీ నాటికి పూర్తి అవుతుందన్నారు.
ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడుతున్నాయన్న ఆయన, ప్రభుత్వం అప్పులు చేస్తోందని పదేపదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, తెలుగుదేశం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఇంతకన్నా 3 రెట్లు అప్పులు చేయాల్సి ఉంటుందన్నారు. మోసం చేయడానికే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను నెట్లో కనిపించకుండా చేశారని విమర్శించారు. అప్పుల్లో పెరుగుదల అప్పటికంటే ఇప్పుడు తక్కువని సీఎం తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు - కేక్ కట్ చేసిన అధ్యాపకులు