రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో పాటు ఇతర రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద రెండో రోజు తమ నిరసనలను కొనసాగించారు. అయితే తొలి రోజు మాత్రం తమ గళంతో పోరాటం సాగించిన రెజ్లర్లు.. రెండో రోజు మాత్రం మౌన నిరసన చేపట్టారు. కాగా మహిళా రెజ్లర్లను ఫెడరేషన్ చీఫ్ లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన వల్ల తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వినేశ్ ఫొగట్‌తో సహా పలువురు రెజ్లర్లు బుధవారం జంతర్ మంతర్ ఎదుట నిరసనకు దిగారు.
అయితే వారి ఆందోళనలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. గత పదేళ్లుగా ఫెడరేషన్తో ఎలాంటి ఇబ్బందులు రాని రెజర్లకు.. కొత్త నిబంధనలు తీసుకొచ్చాక వచ్చాయా అని ప్రశ్నించారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ల వెనుక ఓ పారిశ్రామిక వేత్త ఉన్నారేమోనని తనకు అనుమానం వస్తుందని ఆయన అన్నారు. తాను పదవికి రాజీనామా చేయనని, పోలీసులు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.