ETV Bharat / sports

ఆ ఫుట్​బాల్​ సంబరం భారత్​కు ఎప్పుడు..? సాకర్​ అర్హత సాకారమయ్యేనా? - యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా గెలిస్తే పొంగిపోయాం.. మెస్సి కప్పు కల తీరితే సంబరాలు చేసుకున్నాం. మరి.. సాకర్‌ సమరంలో భారత్‌ తలపడితే చూసేదెప్పుడు? కప్పు సంగతి పక్కనెడితే కనీసం టోర్నీకి అర్హత సాధించినా సంబరాలు చేసుకునేదెప్పుడు?.. ఇప్పటికైతే ఇవి జవాబు లేని ప్రశ్నలే. సుమారు 4.62 కోట్ల జనాభా ఉన్న అర్జెంటీనా విశ్వ విజేతగా అవతరించింది. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన క్రొయేషియా 2018లో రన్నరప్‌గా నిలిచి.. ఈసారి మూడో స్థానం సాధించింది. కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌.. మాత్రం ప్రపంచకప్‌ అర్హతకూ చాలా దూరంలో ఉంది.

fifa
ఆ సంబరం మనకెప్పుడు
author img

By

Published : Dec 21, 2022, 7:36 AM IST

Updated : Dec 21, 2022, 8:58 AM IST

భారత జట్టు ఆసియా స్థాయిలోనే ఉత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నప్పుడు ఇక ప్రపంచకప్‌, ఒలింపిక్స్‌ గురించి ఏం ఆలోచిస్తాం? ఘనమైన ఫుట్‌బాల్‌ చరిత్ర కలిగిన మన దేశం.. ఇప్పుడు ప్రపంచకప్‌ అర్హతకు ఎంతో దూరంలో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ఒకప్పుడు ఆసియా నంబర్‌వన్‌గా ఉన్న జట్టు.. ఇప్పుడు 19వ స్థానంలో కొనసాగుతోంది. ఫుట్‌బాల్‌పై ప్రభుత్వాల అశ్రద్ధ, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)లో గతంలో అంతర్గత కుమ్ములాటలతో కొరవడిన పర్యవేక్షణ.. తగ్గిన ఆదరణ.. ప్రణాళిక-కార్యాచరణ లోపాలు. ఇలా జట్టు దిగజారడానికి ఎన్నో కారణాలు. ఇప్పుడు దేశంలో చాలా మంది మెస్సి, రొనాల్డో లాంటి ఆటగాళ్లను తలుస్తున్నారు. కానీ భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి పేరు ఎంతమందికి తెలుసు? మన దగ్గర ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లనే గుర్తించకపోతే.. ఆటకు ఆదరణ ఎలా దక్కుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

క్రమంగా పడిపోతూ..
1950, 1960వ దశకాల్లో భారత ఫుట్‌బాల్‌ ఓ వెలుగు వెలిగింది. 1951, 1962 ఆసియా క్రీడల్లో పసిడి ముద్దాడింది. 1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 1964 ఆసియా కప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన క్రమంగా పడిపోయింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైరవడం, 1963లో చనిపోయిన దిగ్గజ కోచ్‌ రహీమ్‌ స్థానాన్ని భర్తీ చేసే మరో కోచ్‌ దొరకకపోవడంతో ఫుట్‌బాల్‌ ప్రభ కోల్పోయింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) సరైన చర్యలు తీసుకోకపోవడంతో జట్టు ప్రదర్శనతో పాటు ఆదరణ కూడా తగ్గింది. జట్టు ప్రమాణాలు పడిపోయాయి.

1930లో ప్రపంచకప్‌ ఆరంభమవగా.. ఇప్పటివరకూ భారత్‌ ఒక్కసారి కూడా ఈ మెగాటోర్నీలో ఆడలేకపోయింది. 1950లో తమ క్వాలిఫికేషన్‌ గ్రూప్‌లోని కొన్ని దేశాలు తప్పుకోవడంతో భారత్‌కు ఆడే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రెజిల్‌కు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం అర్హతకు దగ్గరగా కూడా రాలేకపోయింది. ఇక ఏఐఎఫ్‌ఎఫ్‌లో అంతర్గత విభేధాలు, వర్గ పోరు, రాజకీయ ప్రమేయం కారణంగా ఆటను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో ఈ ఏడాది ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించి, ఆ తర్వాత ఎత్తేసింది.

ఆ లీగ్‌ల వల్ల..
యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌, ఇంగ్లిష్‌ ప్రిమియర్‌ లీగ్‌, స్పానిష్‌ లాలిగా, జర్మన్‌ బుండెస్‌లిగ, ఇటాలియన్‌ సిరీస్‌ 'ఏ', 'బి', ఫ్రెంచ్‌ లీగ్‌ 1.. ఇలా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌లు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడుతూ ఇతర దేశాల ఆటగాళ్లు లబ్ధి పొందుతున్నారు. ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో మొరాకో సెమీస్‌ వరకూ వచ్చిందంటే.. ఆ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇలాంటి లీగ్‌ల్లో ఆడి, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం ప్రధాన కారణం. కానీ మన ఆటగాళ్లు ఈ విదేశీ లీగ్‌ల్లో ఆడే స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆ దిశగా మన ప్రమాణాలు ఎంతో మెరుగుపడాలి. అందుకు నిరంతర కసరత్తు కావాలి.

''మన దేశంలో టోర్నీలు, లీగ్‌ల నిర్వహణలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతంతో పోలిస్తే టోర్నీల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణలో నిజాం గోల్డ్‌ కప్‌ చరిత్రలో కలిసిపోయింది. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో టోర్నీలు కనమరుగయ్యాయి. ఐరోపా తరహాలో లీగ్‌ల ద్వారా మార్పు తేవాలని చూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌, ఐ- లీగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లు భారత ఫుట్‌బాల్‌కు మేలే చేస్తాయి. కానీ అందుకు సమయం పడుతుంది. ముందుగా వీటిని అందరికీ చేరువ చేయాలి. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లను ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలి'' అని భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌ తెలిపాడు. ఓ రేడియో ఛానెల్‌లో ప్రపంచకప్‌ వ్యాఖ్యానం కోసం ఆయన ఖతార్‌ కూడా వెళ్లొచ్చాడు.

fifa
ఫిఫా ప్రపంచకప్

చిన్న వయసులోనే..
గావస్కర్‌, సచిన్‌, కోహ్లి లాంటి క్రికెట్‌ దిగ్గజాలు.. బాల్యంలోనే ఆటను మొదలెట్టారు. ఫుట్‌బాల్‌లోనూ అలా జరిగితే మార్పు దిశగా అడుగులు పడతాయి. శిక్షణ కేంద్రాలు, అకాడమీలు విరివిగా అందుబాటులోకి తేవాలి. అత్యుత్తమ కోచ్‌లను నియమించి మెరుగైన శిక్షణ అందించాలి. ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె పుట్టి పెరిగిన బాండీలో చిన్నారులు ఆటపై ఇష్టంతో సాగుతున్నారు. కానీ మన దగ్గర అలాంటి వాతావరణం కనిపించడం లేదు.

ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాల్లో ఫుట్‌బాల్‌ సంస్కృతి బలంగా ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలు ఫుట్‌బాల్‌ను ఆడుతుంటారు. ఆటపై ఇష్టం పెంచుకుంటారు. అదే కెరీర్‌గా ముందుకు సాగుతారు. కానీ మన దగ్గర ఆ సంస్కృతి ఇప్పుడు లేదు. ఒకప్పుడు భారత జట్టు ఆట చూసి ఫుట్‌బాల్‌పై ప్రేమ పెంచుకున్న వాళ్లు ఉన్నారు. కానీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన పడిపోవడంతో అంతా తలకిందులైంది. తిరిగి ఆ వైభవం రావాలంటే అన్నింటి కంటే ముందు విధానం మారాలి. సంస్థాగత మార్పులు రావాలి. ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుందనే భరోసా ఆటగాళ్లకు ఇవ్వగలగాలి.

''ఆటగాళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలి. విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ అక్కడి ఆటగాళ్లు రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. స్పాన్సర్లు ఎక్కువగా లేరు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆట అభివృద్ధిపై ధ్యాస పెట్టాలి. హాకీకి ఒడిషా స్పాన్సర్‌గా నిలిచినట్లుగా.. ఫుట్‌బాల్‌కూ మద్దతు కావాలి'' అని అమల్‌రాజ్‌ చెప్పాడు. ఫిట్‌నెస్‌ పరంగా, ఆట ప్రమాణాల పరంగా ఆసియా జట్లూ మెరుగవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరిన జపాన్‌, కొరియా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. వీటితో పాటు సౌదీ అరేబియా, ఇరాన్‌ లాంటి దేశాలు ఫుట్‌బాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. కానీ మనమే వెనకబడ్డాం.

మార్పు దిశగా..
ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్‌, కేరళ, దిల్లీ, ముంబయి లాంటి చోట్ల ఫుట్‌బాల్‌కు ఎక్కువ మంది అభిమానులున్నారు. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగానూ ప్రజల్లో ఆటపై ఆసక్తి కలుగుతోంది. పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతున్నాయి. ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా మాజీ గోల్‌కీపర్‌ కల్యాణ్‌ చౌబె రావడం శుభపరిణామం. సమాఖ్యలో అత్యున్నత పదవిలో ఓ మాజీ ఆటగాడు ఉండడం భారత ఫుట్‌బాల్‌కు మేలు చేసేదే. ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఎలాంటి రాజకీయాలకు మళ్లీ చోటు ఇవ్వకూడదు. ముందు నైపుణ్యాలు ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలి.

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోనూ ప్రతిభాన్వేషణ కొనసాగించాలి. అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఎక్కువగా టోర్నీలు నిర్వహించాలి. లీగ్‌లు ఆడించాలి. ఫుట్‌బాల్‌ సంస్కృతిని పెంపొందించాలి. అందుకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందించాలి.

పాఠశాలలో ఆటలను తప్పనిసరి చేయాలి. అత్యుత్తమ శిక్షణ అందేలా చూడాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లు క్రమం తప్పకుండా నిర్వహించాలి. వీటిల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి సానబెట్టాలి. జాతీయ జట్టుకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించాలి. ముందు ఆసియా స్థాయిలో తిరిగి పట్టు సాధించేలా చూడాలి. ఆ తర్వాత ప్రపంచకప్‌ దిశగా ఇదే స్ఫూర్తితో సాగాలి.

Last Updated : Dec 21, 2022, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.