ఫార్ములా వన్ రేసులకు రంగం సిద్ధమైంది. జులై 5, 12 తేదీల్లో ఆస్ట్రియాలో రెండు రేసులు జరగనున్నాయి. తమ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని మెక్‌లారెన్ జట్టు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల మార్చిలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన సీజన్ ఆరంభ రేసు రద్దయింది. తిరిగి సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో డ్రైవర్‌కు కరోనా సోకినా లేదా జట్టు పోటీ నుంచి తప్పుకున్నా రేసును రద్దు చేయమని ప్రకటించారు ఫార్ములా వన్ సీఈఓ ఛేజ్ కేరీ.
"ఒకవేళ కారు నడిపే డ్రైవర్‌కు కరోనా వస్తే.. ఆ బృందంలోని రిజర్వ్ డ్రైవర్లను బరిలో దించాలి. ఎట్టి పరిస్థితుల్లో రేసు మాత్రం రద్దు చేయం" అని కేరీ అన్నారు.
ఐరోపా సీజన్లో భాగంగా ఎనిమిది రేసులకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రియాలో రేసులు ముగిశాక.. జులై 19న హంగరీ, ఆగస్టు 2, 9న బ్రిటీష్, స్పెయిన్ (ఆగస్టు 16), బెల్జియం (ఆగస్టు 30), ఇటలీ (సెప్టెంబర్ 6) గ్రాండ్‌ప్రిలు జరుగుతాయి. అయితే ఈ పోటీలను చూసేందుకు అభిమానులను అనుమతించరు.