వచ్చే ఏడాది జనవరిలో తొలిసారిగా జరిగే మహిళల అండర్ -19 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఏ తన జట్టును ప్రకటించింది. అయితే, ఇక్కడ రెండు ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవేంటంటే..
అమెరికా నుంచి తొలి మహిళా జట్టు.. అమెరికా 2010లో పురుషుల అండర్ -19 జట్టు ప్రపంచకప్‌లో ఆడగా.. తాజాగా ఆ దేశ మహిళా జట్టు కూడా తొలిసారి ప్రపంచకప్ కోసం రంగంలోకి దిగింది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 7వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకతో కూడిన గ్రూప్ - Aలో యూఎస్‌ఏ తలపడనుంది.
అందరివీ భారత మూలాలే.. అండర్ - 19 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఏ 15 మందితో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా గీతికా కొడాలి బాధ్యతలు నిర్వర్తించనుంది. అలాగే మిగతా వారంతా భారత మూలాలు కలిగిన క్రికెటర్లు కావడం గమనార్హం. వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాటర్ శివనారయణ్ చంద్రపాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. అలాగే మరో ఐదుగురిని రిజర్వ్‌లో ఉంచారు.
యూఎస్‌ఏ జట్టు ఇదే.. గీతికా కొడాలి (కెప్టెన్), అనికా కొలన్ (వైస్ కెప్టెన్), అదితి చుదసామ, భూమిక భద్రిరాజు, దిశా దింగ్రా, ఇసాని వంగేలా, జివానా అరాస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేశ్, పూజా షా, రితు సింగ్, సాయి తన్మయి ఈయున్ని, స్నిగ్ధ పాల్, సుహాని తదాని, తరనుమ్ చోప్రా
రిజర్వ్: చేత్నా ప్రసాద్, కస్తూరి వేదాంతమ్, లిసా రంజిత్, మిథాలీ పట్వార్థాన్, టై గోన్సాల్వేస్
యూఎస్‌ఏ మ్యాచ్‌లు ఇలా:
* శ్రీలంకతో జనవరి 14న
* ఆస్ట్రేలియాతో జనవరి 16న
* బంగ్లాదేశ్‌తో జనవరి 18న
ఇదీ చూడండి: IND VS BAN: టీమ్ఇండియా ఆలౌట్.. రాణించిన పుజారా, శ్రేయస్