మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో గెలుపొందింది నాకౌట్ పోరుకు చేరింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (87; 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీకి దగ్గరగా వచ్చి ఔటైంది. షెఫాలీ వర్మ (24), జెమీమీ రోడ్రిగ్స్ (19) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ 3, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, ఆర్లీన్ కెల్లీ ఓ వికెట్ తీశారు.
ఇక భారత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఐర్లాండ్.. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. అయితే ఐర్లాండ్ గెలుపు కోసం ఆట నిలిపే సమయానికి చేయాల్సిన స్కోరు 59. దీంతో టీమ్‌ఇండియాను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతగా ప్రకటించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీసింది. ఇంకా ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డుకెక్కింది.
స్మృతి మంధాన జోరు.. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ మొదటి 10 ఓవర్లలో వికెట్ కోల్పోయి 63 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత స్మృతి మంధాన తన వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే కారా ముర్రే వేసిన 14 ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 47 వద్ద స్మృతికి లైఫ్ లభించింది. ఆ తర్వాత అదే ఓవర్‌లో చివరి బంతికి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. జార్జినా డెంప్సే వేసిన 15 ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మంధాన.. ఆ తర్వాత డెలానీ వేసిన ఓవర్‌లో సిక్సర్ బాదింది.
ఇక ఇదే ఓవర్‌లో హర్మన్ (13), రిచా ఘోష్ (0)లు పెవిలియన్ చేరారు. ఈ క్రమంలోనే మళ్లీ డెలానీ వేసిన 18 ఓవర్‌లో మంధాన ఓ 4, ఓ సిక్సర్ బాది మరోసారి దూకుడు ప్రదర్శించింది. కానీ, ప్రెండర్‌గాస్ట్ వేసిన 18.4 ఓవర్‌కు గాబీ లూయిస్‌కి క్యాచ్ ఇచ్చి ఔటైపోయింది. తర్వాతి బంతికే క్రీజులో ఉన్న దీప్తి శర్మ (0) డకౌట్ అయింది. ఆఖరి ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్ రెండు ఫోర్లు బాది చివరి బంతికి స్టంపౌట్ అయింది. అలా భారత్ తన ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
ఇదీ చూడండి: కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెనే కాదు.. మరో బిగ్ షాక్ కూడా..