Sunrisers Hyderabad Auction 2022: "చాయ్, బిస్కెట్ల కోసం సన్‌రైజర్స్ వేలానికి వచ్చింది".. ఇదీ ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన విధానంపై సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న మీమ్స్. జట్టును బలంగా తీర్చిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ఫ్రాంఛైజీ వృథా చేసుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం ప్రయత్నించకుండా.. యాజమాన్యం అసలు ఏ వ్యూహాన్ని అమలు చేసిందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్ (రూ.10.75 కోట్లు), షెఫర్డ్ (రూ.7.75 కోట్లు)తో పాటు అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు)ను అంత మొత్తంలో చెల్లించి సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బెయిర్‌స్టోను కాదని కొంతకాలంగా ఫామ్‌లో లేని పూరన్ కోసం సన్‌రైజర్స్ పట్టుపట్టింది. గతేడాది పంజాబ్ తరపునా పూరన్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. కానీ సన్‌రైజర్స్ మాత్రం భారీ ధరకు అతణ్ని దక్కించుకుంది.
27 ఏళ్ల ఆల్‌రౌండర్ షెఫర్డ్ కోసం కూడా ఊహించని మొత్తాన్ని చెల్లించింది ఎస్ఆర్హెచ్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోనూ అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. కానీ భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం ఉండడం వల్ల ఫినిషర్‌గా పనికొస్తాడని యాజమాన్యం భావించి ఉండొచ్చు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను తిరిగి సొంతం చేసుకోవడానికి అంత డబ్బు ఖర్చు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. గత సీజన్లలో సన్‌రైజర్స్ తరపున అతని ప్రదర్శన నామమాత్రంగానే ఉంది. కానీ 21 ఏళ్ల ఈ ఆటగాడిపై జట్టు అంత నమ్మకం ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు. బహుశా విజయ్ హజారే ట్రోఫీలో సర్వీసెస్‌పై పంజాబ్ తరపున 117 బంతుల్లో 169 పరుగులు చేసిన అతని ప్రదర్శన ఆకట్టుకుని ఉండొచ్చు.
ఇక భువనేశ్వర్, నటరాజన్‌లను తిరిగి జట్టులోకి తీసుకుంది. రాహుల్ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు) కోసం అంత ధర పెట్టడంలో ఓ అర్థముంది. కానీ మిగతా ఆటగాళ్ల విషయంలోనే మరింత పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: IPL 2022 Mega auction: ఏ ఫ్రాంఛైజీ ఎవరిని కొనుగోలు చేసిందంటే?