Ravishastri on Kohli captaincy: విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు వ్యవహారంపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. " ఇది సరైన మార్గంగా అనిపిస్తోంది. ఇది విరాట్, రోహిత్‌లకు వరం కావచ్చు. ఒకే వ్యక్తి మూడు ఫార్మాట్లలోని జట్లను నడపడం సవాలే. అదీనూ కొవిడ్ కారణంగా బయోబబుల్ వంటి పరిస్థితుల్లో సులభం కాదు. విరాట్ తప్పకుండా రెడ్ బాల్ (టెస్టు క్రికెట్) ఆట మీద దృష్టిసారించాలి. కనీసం ఇంకా ఐదారేళ్లు ఆడే సత్తా అతడిలో ఉంది" అని పేర్కొన్నాడు.
ప్రధాన కోచ్‌గా తనకు కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. "మేమిద్దరం ఒకే రకంగా ఆలోచిస్తాం. కొంచెం దూకుడుగా ఉండే స్వభావం. గెలవాలనే కాంక్షతోనే ఆడేందుకు ప్రయత్నించాం. దాని కోసం టెస్టుల్లో అయితే 20 వికెట్లు పడగొట్టాలి. అందుకు అవసరమైన ఆటగాళ్ల ఎంపిక పట్ల పూర్తి అవగాహనతో ఉండేవాళ్లం. విజయం కోసం దూకుడు, ఎలాంటి బెరుకు లేకుండా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా భయం ఆవహిస్తే అది అంటువ్యాధిలాగా సోకుతుందని గ్రహించాం" అని వివరించాడు.
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
కెప్టెన్సీ తొలగింపు వ్యవహారానికి ముగింపు పలికేలా విరాట్ కోహ్లీ.. బీసీసీఐ టాప్ మేనేజ్‌మెంట్ సామరస్యంగా ముందుకెళ్లాల్సి ఉందని టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ సూచించారు. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు చర్చిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘‘వ్యక్తిగత జీవితాల్లో అహంకారాలు (ఇగోలు) పెద్ద పాత్ర పోషిస్తాయి. అయితే ఇగో అనేది ఇక్కడ ఉండకూడదు. విరాట్ కోహ్లీ శక్తివంతమైన ఆటగాడు. అలానే సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ అధ్యక్షుడికి పవర్ ఉంటుంది. అందుకే ఇలాంటి వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి’’ అని కిర్మాణీ తెలిపారు.
ఇదీ చూడండి: Kohli captaincy: 'వన్డే, టెస్టుల్లోనూ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుంటాడు!'