లీగ్ మొదటి సీజన్ నుంచి విరాట్ ఆర్సీబీతోనే ఉన్నాడు. క్రిస్‌గేల్, డివిలియర్స్, స్టెయిన్ లాంటి భీకరమైన ఆటగాళ్లు సైతం ఆ జట్టులో ఆడినప్పటికీ.. ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీకి అందని ద్రాక్షలాగే ఉంది. ప్రతి ఏటా "ఈ సాల కప్ నమ్దే"( ఈ సారి కప్పు మాదే) అంటూ సీజన్ ప్రారంభించి ఆఖర్లో తడబడతారు. పదిహేనేళ్లుగా ఇదే తంతు. ఇదిచాలదు అన్నట్టుగా వారి ఫ్యాన్స్‌ను ఒక తారీఖు ఆందోళనకు గురిచేస్తుంది.
అదేంటంటే.. టీ20ల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు క్రిస్‌గేల్. గేల్ 2011-17 సీజన్ల వరకు ఆర్సీబీకి ఆడాడు. ఆర్సీబీకి ఎన్నో విజయాలను అందించాడు. అయితే 2013లో సరిగ్గా ఇదే రోజున రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు పుణె వారియర్స్ ఇండియాతో తలపడింది. ఆ రోజు గేల్ చేసిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. నమ్మశక్యం కానీ రీతిలో దయాదాక్షిణ్యం లేకుండా పుణె బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా 175 పరుగులు చేశాడు. 17 సిక్సర్లు 13 ఫోర్లతో సునామీ సృష్టించాడు ఈ యూనివర్సెల్ బాస్. దీంతో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.
ఆ తర్వాత 2016లో మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న సురేశ్ రైనా సారధ్యం వహించిన గుజరాత్ లయన్స్‌తో పోటీపడింది ఆర్సీబీ. ఆ మ్యాచ్‌లో గేల్ త్వరగానే ఔటయినప్పటికీ కింగ్ కోహ్లీ, సౌతాఫ్రికా స్టార్ డివిలియర్స్ బ్యాట్ ఝుళిపించారు. పోటీపడి మరీ బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వారిద్దరూ శతకాలు పూర్తిచేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 248 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఆర్సీబీదే రికార్డు.
ఇదంతా నాణేనికి ఒక వైపు కాగా రెండో వైపున అత్యంత చెత్త రికార్డులను కూడా ఆర్సీబీ తమ ఖాతాలో వేసుకుంది. 2017లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతానైట్ రైడర్స్‌ను ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాను 131 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ ఛేదనలో చతికిలపడింది. బ్యాటర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. ఒక్క ప్లేయర్ కూడా డబుల్ డిజిట్ అందుకోలేక పోయారు. 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటయ్యారు. 9 పరుగులు చేసిన జాదవే టాప్ స్కోరర్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఘనతతో పాటు అత్యల్ప స్కోర్ నమోదు చేసిన చెత్త రికార్డునూ మూటగట్టుకుంది.
ఇకపోతే గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్సీబీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి మరోసారి 100 పరుగుల లోపే చేతులెత్తేసింది ఆర్సీబీ. 16.1 ఓవర్లలో 68 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సహా మూడు డకౌట్లు నమోదు అయ్యాయి. అలా ఏప్రిల్ 23న ఆడిన ఈ నాలుగు మ్యాచుల్లోనూ రెండు అత్యుత్తమ, రెండు అతి ఘోరమైన ప్రదర్శనలు ఆర్సీబీ సొంతం.
కాగా ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్రదర్శన ఎలా ఉండబోతోందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా 2011,2016 తరహా ఇన్నింగ్స్‌లు పునరావృతం కావాలని ఆర్సీబీ అభిమానులు ఆరాటపడుతున్నారు.
నేడు గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ... ప్రతి సంవత్సరం లాగే ఈ సీజన్లో కూడా ఆర్సీబీ ఇవాళ గ్రీన్ జెర్సీలో ఆడబోతోంది. 'గ్రీన్ గేమ్' ఆలోచనతో 2011 నుంచి ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఆడుతోంది. పర్యావరణంపై అవగాహన పెంచడంలో భాగంలో ఓ ప్రయత్నంగా ఇలా తమ హోంగ్రౌండ్లో జరిగే ఒక మ్యాచ్‌లో జట్టు గ్రీన్ జెర్సీ ధరిస్తుంది. ఈమ్యాచ్‌లో టాస్ అనంతరం ప్రత్యర్థి జట్టుకు ఓ మొక్కను బహుమతిగా అందజేస్తారు.