IPL ratings dropped: ఏటా క్రికెట్ అభిమానులకు అమితమైన వినోదాన్ని అందించే ఐపీఎల్.. ఈ సీజన్లో కాస్త నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. అందుకు మొదటి వారంలో పడిపోయిన టీవీ రేటింగ్స్ నిదర్శనం. బీసీసీఐకి షాక్ ఇస్తూ గతేడాదితో పోలిస్తే.. ఐపీఎల్ 2022 మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం.. నిరుడు తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్ లభించగా.. ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్ వచ్చింది. 2023-2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐకి ఇది మింగుడుపడని పరిణామమే. అయితే ఐపీఎల్ 2020, 2021 సీజన్లను దిగ్విజయంగా నిర్వహించిన బీసీసీఐ ఇలాంటి పరిణామం ఎదుర్కోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే...
- ఐపీఎల్ ప్రారంభానికి ముందు టోర్నీ గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం రేటింగ్స్‌పై ప్రభావం చూపి ఉండొచ్చు!
- టోర్నీ ఆరంభానికి ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం, మీడియా మొత్తం దానిపైనే దృష్టిసారించడం వల్ల లీగ్‌కు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు.
- గతేడాది కరోనా భయాలతో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. దీంతో టీవీ రేటింగ్స్ బాగా పెరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు మెరుగవడం వల్ల తిరిగి ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇది కూడా రేటింగ్స్ పడిపోవడానికి ఓ కారణం.
- అడపాదడపా మినహా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు కూడా ఏమంత రసవత్తరంగా లేకపోవడమూ కారణమే.
- 10 జట్లతో టోర్నీని నిర్వహించడం వల్ల లీగ్ చాలా సుదీర్ఘంగా జరుగుతుందనే భావన కలగడం.
- రైనా, ఏబీ డివిలియర్స్ వంటి పలువురు ఆటగాళ్లు దూరమవడం
- ఏప్రిల్ 6 వరకు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం
- చెన్నై, ముంబయి, బెంగళూరు వంటి జట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు మెగావేలం కారణంగా ఇతర జట్లలోకి వెళ్లడం కూడా అభిమానులను నిరాశపరిచింది.
- ధోనీ, కోహ్లీ కెప్టెన్లుగా లేకపోవడం
- ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు అశేష అభిమానగణం ఉంది. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్లు కూడా అవే. కానీ అందరి అంచనాలకు భిన్నంగా లీగ్‌లో ఈ రెండు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం.
- ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ప్రారంభం కాగ, దానికి ఒకరోజు ముందే.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం వల్ల జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ఐపీఎల్ వీక్షణలపై ప్రభావం చూపి ఉండొచ్చు.
ఇదీ చూడండి: సన్‌రైజర్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్‌కు గాయం