IPL 2022 CSK VS RCB strengthness: ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు ఆడిన నాలుగింటిలో మూడు విజయాలతో దూసుకుపోతోంది. దీంతో మంగళవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు జట్ల బలాబలాలు చూస్తుంటే బెంగళూరు విజయానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
డుప్లెసిస్ కీలకం.. దశాబ్ద కాలం పాటు చెన్నై జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా రాణించిన ఫాఫ్ డుప్లెసిస్ ఈసారి మెగా వేలంలో బెంగళూరు గూటికి చేరాడు. మరోవైపు ఇక్కడ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడం వల్ల ఆ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో బెంగళూరును నడిపిస్తున్నాడు. అయితే, డుప్లెసిస్‌కు సుదీర్ఘకాలం చెన్నైలో ఆడిన అనుభవం ఉండటం వల్ల ప్రత్యర్థులపై ఆ జట్టు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే విషయాలపై కచ్చితమైన అవగాహన ఉండే అవకాశం ఉంది. దీంతో విరాట్ కోహ్లీని ఎలా నియంత్రించాలనేదానిపై చెన్నై ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్న విషయంపైనా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఎలాంటి సలహాలు ఇస్తాడనేది కీలకం కానుంది.
బెంగళూరు బ్యాట్స్‌మెన్ జోరు.. ఈ సీజన్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ అదరగొడుతున్నారు. ఒకరు కాకపోతే మరొకరు పరుగులు తీస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్లు డుప్లెసిస్, అనూజ్ రావత్‌తో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీ రాణిస్తున్నారు. అలాగే గత మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి హిట్టర్ కూడా అందుబాటులోకి రావడం వల్ల ఆ జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. ఇక ఫినిషర్లుగా దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ సైతం ధాటిగా ఆడుతున్నారు. దీంతో ఎలా చూసినా బెంగళూరు బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గా కనిపిస్తోంది.
అదే సమయంలో చెన్నై బ్యాటింగ్‌ను పరిశీలిస్తే.. మిడిల్ ఆర్డర్‌లో శివమ్‌దూబె, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారు. టాప్ ఆర్డర్‌లో రుతురాజ్, రాబిన్ ఉతప్పతో పాటు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా సైతం విఫలమవుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం బెంగళూరు.. చెన్నైతో పోలిస్తే మంచి స్థితిలోనే ఉంది. హర్షల్ పటేల్, హసరంగ రాణిస్తుండగా చెన్నైలో డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ఈరోజైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
ఇదీ చూడండి: ఐపీఎల్ బోర్ కొడుతోందా? అందుకే రేటింగ్స్ పడిపోయాయా?