India vs Hong Kong Asia Cup : చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హోరాహోరీ పోరులో విజయం సాధించి ఆసియా కప్ టీ20 టోర్నీలో శుభారంభం చేసిన టీమ్‌ఇండియా.. బుధవారం తన తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. టోర్నీలో అత్యంత బలహీన జట్టు, క్వాలిఫయర్స్ ద్వారా ఆసియా కప్‌నకు అర్హత సాధించిన హాంకాంగ్‌ను రోహిత్ సేన ఢీకొనబోతోంది. గ్రూప్-ఎలో భారత్, పాక్ కాకుండా ఉన్న మూడో జట్టు హాంకాంగే. తీవ్ర ఒత్తిడితో కూడిన పాక్ పోరు తర్వాత.. భారత్ ఈ మ్యాచ్‌ను ప్రశాంతంగా ఆడుకోవడానికి అవకాశముంది. ఒక రకంగా సూపర్-4 దశకు ముందు దీన్ని టీమ్‌ఇండియాకు ప్రాక్టీస్ మ్యాచ్‌లా భావించవచ్చు. హాంకాంగ్ స్థాయికి ఈ మ్యాచ్‌లో కాస్త పోటీ ఇచ్చినా గొప్ప విషయమే. ఆ జట్టులో ఎక్కువగా భారత్, పాకిస్థాన్ సంతతికి చెందిన ఆటగాళ్లున్నారు. కెప్టెన్ నిజాకత్ ఖాన్‌తో పాటు హరూన్ అర్షద్, కించిత్ షా లాంటి ఆల్‌రౌండర్ల మీద ఆ జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. ఐజాజ్ ఖాన్, బాబర్ హయత్, ఎహ్‌సాన్ ఖాన్ కూడా ప్రతిభావంతులే.
భారత్ లాంటి పెద్ద జట్టుతో మ్యాచ్‌లో సత్తా చాటి క్రికెట్ ప్రపంచానికి తమను పరిచయం చేసుకోవాలని హాంకాంగ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ కొన్ని మార్పులు చేసే అవకాశముంది. పాక్‌పై తుది జట్టులో చోటు దక్కించుకున్న జడేజా, చాహల్, దినేశ్ కార్తీక్‌ల స్థానంలో అశ్విన్, రవి బిష్ణోయ్, పంత్‌లను ఆడించొచ్చు. రాహుల్, కోహ్లిలతో పాటు రోహిత్ కూడా పూర్వపు ఫామ్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టాప్‌ఆర్డర్లో మార్పులేమీ ఉండకపోవచ్చు. హాంకాంగ్‌పై అయినా రాహుల్, కోహ్లి చెలరేగి ఆడతారేమో చూడాలి. పాక్‌పై బ్యాటుతో, బంతితో చెలరేగిన ఆల్‌రౌండర్ హార్దిక్‌పై పని భారం పెరగకుండా చూసేందుకు విశ్రాంతిని ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. అతను ఆడకుంటే దీపక్ హుడా తుది జట్టులోకి వస్తాడు. గ్రూప్ దశలో భారత్‌కిదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తే గ్రూప్-ఎలో అగ్రస్థానంతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. పాక్, హాంకాంగ్ మధ్య చివరి మ్యాచ్‌లో విజేత రెండో సూపర్-4 బెర్తును సొంతం చేసుకుంటుంది.
ఇదీ చదవండి: 'భారత్-పాక్ మ్యాచ్‌లో క్రికెట్ మాత్రమే గెలిచింది'
'భారత్ 12 మందితో ఆడినట్లు అనిపించింది'.. పాక్ మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్!