IND Vs WI Second ODI:వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్ పటేల్ (64 నాటౌట్) దంచికొట్టడంతో భారత్.. ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 312 పరుగుల భారీ ఛేదనలో శుభ్‌మన్ గిల్ (43), శ్రేయస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54), దీపక్ హుడా (33) తలా ఓ చేయి వేశారు. అయితే, ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి 100 పరుగులు అవసరమైన వేళ అక్షర్ రెచ్చిపోయాడు. టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో తన తొలి అర్ధ శతకం సాధించాడు. దీంతో అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
శుభారంభం దక్కినా..
భారీ ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్ ధావన్ (13; 31 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ తొలి పది ఓవర్లు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, నెమ్మదిగా ఆడుతున్న ధావన్‌ను 11వ ఓవర్‌లో షెపర్డ్ ఔట్ చేసి విండీస్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. దీంతో భారత్ 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న శుభ్‌మన్‌గిల్.. మేయర్స్ బౌలింగ్‌లో అనూహ్య బంతికి కాట్ అండ్ బౌల్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్ (9) సైతం అతడి బౌలింగ్‌లోనే బౌల్డయ్యాడు. దీంతో భారత్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కు 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను పోటీలోకి తెచ్చారు.
అక్షర్ పటేల్ ఆటే హైలైట్..
అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అల్‌జారీ జోసెఫ్ విడదీశాడు. 33వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్‌ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. సంజూతో కలిసి కాసేపు పోరాడాడు. జట్టు స్కోర్ 205 పరుగుల వద్ద సంజూ కూడా పెవిలియన్ చేరడంతో భారం మొత్తం దీపక్, అక్షర్ పటేల్‌లపై పడింది. దీంతో 40 ఓవర్లకు టీమ్‌ఇండియా 212/5తో నిలిచి కష్టోల్లో పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ కాస్త నిలకడగా ఆడి జట్టులో ఆశలు రేపారు. కానీ, కీలక సమయంలో దీపక్.. హోసీన్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. కానీ, శార్దూల్ (3), అవేశ్ ఖాన్(10)తో కలిసి అక్షర్ మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో అల్‌జారీ, మేయర్స్ చెరో రెండు వికెట్లు తీయగా జయ్‌డెన్, షెపర్డ్, హోసీన్ తలో వికెట్ తీశారు.
హోప్ వందలో వంద..
అంతకుముందు, టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ షై హోప్ (115) శతకంతో చెలరేగగా మిగతా బ్యాట్స్‌మెన్ అతడికి సహకరించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ (39), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ (35), కెప్టెన్ నికోలస్ పూరన్ (74) సైతం రాణించడంతో 50 ఓవర్లలో విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. దీంతో టీమ్‌ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో శార్దూల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్, అక్షర్ పటేల్, చాహల్ తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి: అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది: రవిశాస్త్రి