Ind vs SA: ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్ విజయాలు.. వెస్టిండీస్‌ను దాని సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేయడం.. ఇంగ్లాండ్ గడ్డపై ఆధిపత్యం.. ఇదీ 2018 నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శన. విదేశాల్లోనూ జట్టు నిలకడగా రాణిస్తూ గొప్ప విజయాలు సొంతం చేసుకుంటోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి మినహా మిగతా సిరీస్‌ల్లో జట్టు అత్యుత్తమంగా ఆడింది. ఇటీవల కాలంలో జట్టు ఇలా గెలుపు బాటలో సాగడానికి ప్రధాన కారణం మెరుగుపడ్డ బౌలింగ్ అనడంలో సందేహం లేదు. పేస్, బౌన్సీ, సీమ్ పిచ్‌లపై గతంలో కంటే ఉత్తమంగా మన పేసర్లు సత్తాచాటుతున్నారు. ఫాస్ట్‌బౌలర్లకు స్వర్గధామం లాంటి వేదికల్లో ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. కొన్నిసార్లు వాళ్లకు మించి రాణిస్తున్నారు.
ఇప్పుడు అదే పేస్ బౌలంతో సఫారీ గడ్డపై ప్రత్యర్థిని పడగొట్టేందుకు టీమ్‌ఇండియా ఉత్సాహంగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో ఎల్గర్, బవుమా, డికాక్, మర్‌క్రమ్, డసెన్ లాంటి బ్యాటర్లున్నారు. ఒకప్పుడు డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ లాంటి మేటి ఆటగాళ్లతో కూడిన ప్రత్యర్థి.. ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది. ఆ జట్టులోని ప్రధాన బ్యాటర్లు ఫామ్‌లో లేకపోవడం కూడా ఓ ప్రతికూలతే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించేందుకు బుమ్రా, షమి, సిరాజ్, ఇషాంత్, శార్దూల్, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌తో కూడిన భారత బౌలింగ్ దళం ఉవ్విళ్లూరుతోంది. దక్షిణాఫ్రికాలో మన పేసర్లకు మంచి రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం.
అక్కడే మొదలెట్టి..
అప్పటికే పరిమిత ఓవర్ల జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన బుమ్రా.. మూడేళ్ల కిందట టీమ్‌ఇండియా తరపున టెస్టుల్లో అడుగుపెట్టింది దక్షిణాఫ్రికాలోనే. 2018లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో బుమ్రా అరంగేట్రం చేశాడు. పేసర్లకు సహకరించే అక్కడి పిచ్‌లపై తన బౌలింగ్ నైపుణ్యాలతో అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో గొప్పగా రాణించి 25.21 సగటుతో 14 వికెట్లు కూల్చాడు. ఇక జట్టు విజయం సాధించిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లతో మొదటిసారి టెస్టుల్లో ఆ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లోనూ బుమ్రా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అదరగొడుతున్నాడు. మధ్యలో గాయం కారణంగా కాస్త నెమ్మదించినప్పటికీ ఇప్పుడు తిరిగి జోరు అందుకున్నట్లు కనిపిస్తున్నాడు.
ఇప్పటికే 24 టెస్టుల్లో 22.79 సగటుతో 101 వికెట్లు తీసిన బుమ్రా.. సఫారీ బ్యాటర్లకు తనదైన యార్కర్లు, స్లో డెలివరీలతో నిద్రలేని రాత్రులు మిగిల్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుత జట్టులో సఫారీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న షమి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాడు. గతంలో అక్కడ రెండు సిరీస్‌ల్లో (2013, 2018) ఆడిన షమి 5 మ్యాచ్‌ల్లో 24.71 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గత సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. స్థిరమైన వేగంతో, నిలకడైన లెంగ్త్, లైన్‌తో బంతులేస్తున్న షమి మరోసారి ప్రత్యర్థి గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల కాలంలో అతని ప్రదర్శన మెరుగ్గా ఉంది. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను ఎక్కువ ప్రభావం చూపుతున్నాడు. బుమ్రాతో కలిసి కొత్తబంతితో అతను ప్రత్యర్థి పట్టుబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆ అనుభవంతో..
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత బౌలర్లలో చూస్తే అందరికంటే ఎక్కువ అనుభవం ఇషాంత్‌కే ఉంది. అతను ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2018) అక్కడ ఆడాడు. ప్రస్తుత జట్టులోనూ అతనే సీనియర్ పేసర్. ఇప్పటివరకు ప్రత్యర్థి గడ్డపై ఏడు మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసిన ఇషాంత్‌కు అక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. 2013 సిరీస్‌లో జొహానెస్‌బర్గ్ టెస్టులో బౌన్సీ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అలాంటి ఆటగాడికి ప్రస్తుత సిరీస్ కోసం జట్టులో చోటు దక్కుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడమే అందుకు కారణం. ఇషాంత్ స్థానానికి హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు. అతనితో పాటు ఉమేశ్, శార్దూల్‌కు ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం లేదు. గతేడాది ఆస్ట్రేలియాలో సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన సిరాజ్ అరంగేట్రం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. మంచి వేగంతో పాటు వైవిధ్యం ప్రదర్శిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. ఈ ప్రదర్శనతోనే అతనికి సఫారీతో సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక ఉమేశ్, శార్దూల్ కూడా అవకాశం వస్తే సత్తాచాటాలనే ధ్యేయంతో ఉన్నారు. శార్దూల్ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తుండడం విశేషం. ప్రధాన బ్యాటర్లు విఫలమైన మ్యాచ్‌ల్లో అతను ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టుతో పాటు ఇంగ్లాండ్‌తో నాలుగో మ్యాచ్‌లోనూ అతను గొప్ప బ్యాటింగ్ పోరాటం వల్ల హీరోగా నిలిచాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పిచ్‌లు స్పిన్‌కు అంతగా సహకరించవని అంటుంటారు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా వికెట్లు తీయడంలో కొంతకాలంగా ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ పట్టు సాధించాడు. బ్యాటర్ల మెదడును చదివేస్తూ అందుకు తగినట్లుగా వ్యూహాలు పన్ని ఫలితాలు రాబడుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం ఉన్న అశ్విన్.. గత పర్యటనలో సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో మెరిశాడు. అతను బ్యాటింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడుతుండడం లాభించే అంశం. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆడే అవకాశం ఉన్న అశ్విన్ తన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తో సత్తాచాటేందుకు సై అంటున్నాడు.
ఇదీ చూడండి : అది మా జట్టుకు కలిసొచ్చే అంశం: పుజారా