Dhoni Sunil gavaskar: చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ వచ్చే ఏడాది కూడా భారత టీ20 లీగ్ ఆడతానని స్పష్టం చేయడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇన్నేళ్లుగా చెన్నై టీమ్‌కు ఎంతో అండగా నిలిచిన అభిమానులకు సొంత మైదానంలో కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్లడం మంచిది కాదని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ధోనీ వయసు 40 ఏళ్లు కావడంతో ఈ సీజనే చివరిది కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో గతరాత్రి స్పష్టతనిచ్చాడు. దీనిపై సునీల్ గావస్కర్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశాడు.
"ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అతడు చెప్పినట్లు ఇన్నాళ్లూ తనని, తను నడిపించిన చెన్నై జట్టుని, ఆదరించిన అభిమానులకు వచ్చే ఏడాది సొంత మైదానంలో కృతజ్ఞతలు తెలియజేయాలనుకోవడం అభినందనీయం. అతడు కేవలం చెన్నైకే కాకుండా టీమ్‌ఇండియాకూ నాయకత్వం వహించాడు. భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఇక వచ్చే ఏడాది ఈ లీగ్ దేశవ్యాప్తంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి జట్టూ ఇంటా బయట మ్యాచ్‌లు ఆడే పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నా. ఇప్పుడు మొత్తం 10 జట్లు ఉండటంతో తర్వాతి సీజన్‌లో పది వేదికల్లోనూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలకొచ్చు. దీంతో ఒకేసారి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పినట్లు అవుతుంది’ అని గావస్కర్ వివరించాడు.
Sunil gavaskar shimron hetmyer: బ్యాటింగ్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్‌పై నెటిజన్లు, రాజస్థాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే భారత టీ20 లీగ్‌లో కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ షిమ్రన్ హెట్‌మెయర్‌పై సన్నీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 15 ఓవర్లకు 104/4తో నిలిచింది. అప్పటికి రవిచంద్రన్ అశ్విన్ (13), షిమ్రన్ హెట్‌మెయర్ (0) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలోనే ప్రత్యక్ష ప్రసారంలో కామెంట్రీ చేస్తున్న గావస్కర్ హెట్‌మెయర్‌ను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు. "Hetmyer's wife delivered, will Hetmyer deliver for the Royals now?" అని అన్నాడు. గావస్కర్ సరదాగా ‘డెలివర్’ అనే పదప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టి నెటిజన్లకు కోపం తెప్పించింది. దీంతో గావస్కర్ వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయంటూ, అవి అభ్యంతరకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, హెట్‌మెయర్ భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనివ్వడంతో అతడు బయోబబుల్ వీడి స్వదేశానికి వెళ్లాడు. తర్వాత తిరిగొచ్చి గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ కరీబియన్ బ్యాట్స్‌మన్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరు పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ, పట్టుదలగా ఆడిన అశ్విన్ (40 నాటౌట్; 23 బంతుల్లో 2x4, 3x6), రియన్ పరాగ్‌తో (10 నాటౌట్; 10 బంతుల్లో 1x6) కలిసి మ్యాచ్‌ను గెలిపించాడు.
ఇదీ చూడండి: భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్‌గా ఎదిగి