సిడ్నీ వేదికగా 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ను టీమ్ఇండియా అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు. అందుకు ఓ కారణం మంకీగేట్ వివాదం. ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌పై హర్భజన్ సింగ్ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణలు రావడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే అదే మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలు భారత జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్‌కు స్టీవ్ బక్నర్, మార్క్ బెన్సన్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తాజాగా ఆ మ్యాచ్‌లో తాను రెండు తప్పులను చేసి భారత జట్టు ఓటమికి కారణమయ్యానని వెల్లడించాడు స్టీవ్ బక్నర్.
"2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేను రెండు తప్పులు చేశా. అందులో ఒకటి భారత్ మ్యాచ్‌పై ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆసీస్ అటగాడికి సెంచరీ చేసే అవకాశం కల్పించా. ఐదో రోజు నేను చేసిన తప్పు భారత ఓటమికి కారణమైంది. ఓ టెస్టులో రెండు తప్పులు చేసిన అంపైర్ నేనే కావొచ్చు. ఆ తప్పులు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి."
-స్టీవ్ బక్నర్, మాజీ అంపైర్
అయితే తన తప్పులను వెనకేసుకొచ్చాడు బక్నర్. కొన్నిసార్లు తప్పులు చేస్తామని.. వాటిని తెలుసుకుని మళ్లీ అదే మిస్టేక్‌ని చేయకుండా ఉండాలని తెలిపాడు. "నేను తప్పులు చేయలేదు అని చెప్పట్లేదు. అయితే కొన్నిసార్లు గాలి ధ్వని పిచ్ మీదుగా వెళ్లి మనకు తప్పుడు భావన కలిగించొచ్చు. అది చూసే వారికి అర్థం కాదు." అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సైమండ్స్ 162 పరుగులతో మెరిసి జట్టు 463 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సచిన్, లక్ష్మణ్ శతకాలతో టీమ్ఇండియా 532 పరుగులతో దీటైన రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. 332 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 210 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలపై భారత జట్టు ఫిర్యాదు కూడా చేసింది.