బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ మృతికి సంబంధించి రోజురోజుకు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదికలో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఆత్మహత్యకు ముందు గూగుల్లో తన గురించే సుశాంత్ వెతికినట్లు అధికారులు చెప్పారు. అతడి గురించి ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని కథనాలు చదివాడని స్పష్టం చేశారు.
జూన్ 14న చనిపోయే కొద్ది నిమిషాల మందు అంటే ఉదయం 10:15 గంటలకు, సుశాంత్ తన పేరునే గూగుల్ చేసినట్లు నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో పండ్ల రసాన్ని సేవించినట్లు అధికారులు గుర్తించారు. తరచుగా గూగూల్లో తన పేరును సెర్చ్ చేసి.. బృందంతో చర్చించేవాడని వివరించారు. ఈ క్రమంలోనే తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నట్లు అతడు భావించినట్లు పేర్కొన్నారు.
ఇటీవలే పోస్టుమార్టం నివేదికలో సుశాంత్ ఉరివేసుకోవడం వల్లే మరణించినట్లు నిర్ధరణ అయ్యింది. అయితే, నటుడు ఆత్మహత్య చేసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సహా మొత్తం 30 మందిని విచారించారు.
ఇదీ చూడండి:గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అల్లు శిరీష్