"ప్రతి హీరోకూ విజయాల కంటే పరాజయాలే ఎక్కువ. అది అందరికీ తెలిసిన సత్యం. ఒక పెద్ద స్టార్ అవ్వడానికి ఐదు మంచి విజయాలు ఉంటే చాలు. 'వరుడు కావలెను' నాకు మరో మంచి విజయాన్ని అందిస్తుంది" అని నాగశౌర్య(naga shourya new movie) అన్నారు. నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తూ.. ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోతున్న యువ కథానాయకుడీయన. ఇటీవల లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను'(varudu kaavalenu release date) చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఆ చిత్రం.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగశౌర్య గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
'వరుడు కావలెను' పెళ్లి కథా? ప్రేమకథా?
పెళ్లి పీటలు ఎక్కడానికి ముందు వరకూ జరిగే కథ ఇది. అదే సమయంలో ఈ సినిమాలో రెండు పరిణతితో కూడిన ప్రేమకథలూ ఉంటాయి. యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రం. 'ఛలో' విడుదల తర్వాత అక్క లక్ష్మీసౌజన్య(varudu kaavalenu director) కథ చెప్పారు. అలా 2018లో మొదలై, 2021 అక్టోబర్ 29 వరకు ప్రయాణం సాగింది.
ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయాలేమిటి?
30 ఏళ్లు వస్తున్నాయనగానే అబ్బాయి, అమ్మాయిలకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. పెళ్లెప్పుడు? ఎవరు చూస్తున్నారు? నన్ను చూడమంటారా? అని అడుగుతుంటారు. అంతేకానీ వాళ్లు ఎంతవరకు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు? ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అనేవేమీ పట్టించుకోరు. అందరికీ తెలిసిన విషయమే ఇది, కానీ ఎవరూ చూపించలేదు. అందుకే ఓకే చెప్పేశా. త్రివిక్రమ్ మా సినిమాలో ఓ సన్నివేశం రాశారు. అందులో నేను నటించా. ఆయన రాసిన మాటల్ని నేను చెప్పాను. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. 16 నిమిషాలు ఫ్లాష్‌బ్యాక్ అద్భుతంగా ఉంటుంది.
నందినిరెడ్డితో కలిసి సినిమా చేశారు, ఇప్పుడు లక్ష్మీసౌజన్య. మహిళా దర్శకులతో పనిచేయడం ఎలా ఉంటుంది?
ప్రశాంతంగా ఉంటుంది. వాళ్లకు ఓపిక ఎక్కువ. అంత త్వరగా కోపం రాదు. మహిళల్లో సహజంగా ఉన్న లక్షణమే అది. సెట్లో రోజూ 500 మందిని డీల్ చేయాలి. ప్రశాంతంగా అంత మందిని డీల్ చేస్తే అంతకంటే మేలు ఇంకేం ఉంటుంది? అబ్బాయిలతో కలిసి పనిచేస్తున్నప్పుడూ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కథానాయిక రీతూ(ritu varma new movie), నదియాలతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. రీతూతో త్వరలోనే మరో సినిమా చేస్తా.
మీరు వధువు కావలెను అని ఎప్పుడు అంటారు?
పెళ్లి చేసుకోవాలనే ఉంది, అది ఎప్పుడవుతుందో నాకూ తెలియదు (నవ్వుతూ). పెద్దలు కుదిర్చినా, ప్రేమించి చేసుకునే పెళ్లికైనా ప్రేమ కావల్సిందే కదా. నేను ఏ రకమైన వివాహం చేసుకుంటా అనేది మాత్రం నాకే తెలియదు.
కొత్త సినిమాల కబుర్లు చెబుతారా?
మూడు సినిమాలూ ఒకేసారి చేశా. 'వరుడు కావాలెను', 'లక్ష్య'తోపాటు, అనీష్ కృష్ణ చిత్రం చేశా. 'లక్ష్య'లో నాలుగు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తా. అనీష్ కృష్ణ చిత్రం తుదిదశకు చేరుకుంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చేస్తున్నా. అది నా కలల సినిమా. నన్ను ఏడు రకాలుగా తెరపై చూస్తారు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం. నాలుగేళ్లయింది ఈ సినిమా పనులు మొదలుపెట్టి. దానికి అంత సమయం పడుతుంది. మరికొన్ని కొత్తవి ప్రకటించాల్సి ఉంది.
నాకూ కొత్త రకమైన కథలు చేయాలని ఉంది. ఎప్పుడైనా సరే, కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా ఉండే సినిమాలే చేస్తా. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలంటే ఇష్టం. ఒకే రోజు ఎదగడం కంటే రోజు రోజూ కొంచెం ఎదుగుతున్నా. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. 'నర్తనశాల' పరాజయం తర్వాత 'అశ్వథ్థామ'కు నా కెరీర్లోనే అత్యుత్తమ ప్రారంభ వసూళ్లు వచ్చాయి. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఓటీటీ కోసం నటించమని అవకాశాలు వచ్చాయి. నేను ఇప్పుడు అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను 70 ఎమ్.ఎమ్ తెరపై చూసుకోవడానికే ఇష్టపడుతున్నా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">