ఆ అమ్మాయి మాతృభాష తెలుగు కాకపోయినా పలకరిస్తే తెలుగులో భలే మాట్లాడేస్తుంది. నటన మీద ఉన్న ఆసక్తితో మొదట్లో షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ఆపై సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమే అమృత అయ్యర్. ఈఏడాది జనవరిలో వచ్చిన హీరో రామ్ 'రెడ్', యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'లో కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్లతో ముచ్చటించింది. ఆ వివరాలివీ..
మీకిది మూడో చిత్రం. దర్శకుడు తేజ మర్ణి వచ్చి కథ చెప్పినప్పుడు ఇందులో ఏ పాయింట్ నచ్చింది?
అమృత: రాజమండ్రిలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నా పాత్ర పేరు శ్రావణి. ఐదుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. అందులో నలుగురు అబ్బాయిలు. నేనొక అమ్మాయిని. స్నేహమంటే సాయం మాత్రమే కాదు.. వాళ్లకోసం ఏదైనా చేయడమే అని చెప్పడమే ఈ కథ నేపథ్యం. ఈ రోజుల్లో ఓ అమ్మాయి స్నేహం కోసం రిస్క్ చేస్తుందంటే ఇంట్లో వాళ్లు ఊరుకోరు కదా! కానీ, ఇందులో నేను రిస్క్ తీసుకుంటా. ఇక పాత్రపరంగా నేను ఏం చేశానన్నది ఆసక్తికర అంశం. ఇదే పాయింట్ నాకు నచ్చింది. థ్రిల్లర్, కుటుంబం, స్నేహం.. ఈ మూడు అంశాల చుట్టూ కథ ఉంటుంది.
టీజర్, టైటిల్ చూస్తుంటే.. పాండవుల మధ్యలో ద్రౌపది అనే ఫీలింగ్ వస్తుంది. మీ పాత్ర ఇందులో ద్రౌపదిలా ఏమైనా ఉంటుందా?
అమృత: నాకలా అనిపించలేదు. ఇదంతా స్నేహం చుట్టూ తిరుగుతుంది. ఫ్రెండ్‌షిప్‌లో అమ్మాయి, అబ్బాయి అని చూడకూడదు. స్నేహంలో ఒకరికొకరు సాయపడాలి.
వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఇతరులకు సాయం చేశారా?
అమృత: హా! చేశాను. సినిమాలో చూపించినట్టు అడవులకు వెళ్లి చేయలేదు.
ప్రేమికులకు, ప్రేమ విషయంలో ఎవరికైనా సాయం చేశారా?
అమృత: (నవ్వులు) ఒక అమ్మాయిగా ఎంత వరకు చేయగలనో అంతే చేస్తా. నా ఫ్రెండ్‌ను తన లవర్ దగ్గరికి చేర్చడం, నా డ్రెస్సులు కావాలంటే ఇవ్వడం, లవర్స్ మధ్య చిన్నపాటి గొడవలైతే కలపడం.. ఇలాంటి సాయాలు చేశా. ఇక సినిమాలో అయితే, ఎవరికెలాంటి సాయం చేశానో వెండితెరపై చూడాల్సిందే.
హీరో శ్రీవిష్ణుతో మీకిది తొలిచిత్రం కదా! ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా కుదిరింది?
అమృత: బాగుంది. మొదట్లో ఆయన్ను చూసి రిజర్డ్వ్ పర్సన్ అనుకున్నా. ఆ తర్వాత స్నేహంగా మెలిగారు. సహజంగా నటిస్తారు. అందరి పట్లా గౌరవంగా ఉంటారు. అందరితో ఒకేలా ప్రవర్తిస్తారు. డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు ప్రతిదీ నేర్చుకునే అవకాశం కుదిరింది.
చిత్రీకరణలో ఎలాంటి సవాళ్లెదుర్కొన్నారు..?
అమృత: అడవుల్లో పరిగెత్తడం నాకు సవాల్‌గా అనిపించింది. మాములుగా అయితే నాకు పరిగెత్తడం తేలికే. కానీ సల్వార్ వేసుకుని చెప్పులు లేకుండా అడవుల్లో పరిగెత్తడం చాలా కష్టంగా అనిపించింది. ఇలానే అడవుల్లో పరిగెడుతున్నప్పుడు ఓసారి కిందపడిపోయా. 40-50 శాతం చిత్రీకరణ అడవుల్లోనే సాగింది. అలా అడవుల్లోకి రానూ, పోనూ మూడు గంటలు పట్టేది. దీంతో షూటింగ్ పూర్తయ్యేసరికి అలసిపోయేదాన్ని.
దర్శకుడి తొలిచిత్రం ‘జోహార్’ చూశారా?
అమృత: ఈ సినిమా చేసిన తర్వాతే ‘జోహార్’ చూశా. దర్శకుడు తేజకు తనమీద తనకు పూర్తి నమ్మకం ఉంది. ఒక సన్నివేశం నాపై చిత్రీకరించాల్సి వచ్చినప్పుడు ‘ఇలాంటి సీన్స్‌లో అమ్మాయిలు ఎలా చేస్తారండి?’ అని అడిగా. దానికాయన ‘మీరెందుకు చేయలేరండి.. మీరు చేయగలరు. చేస్తారు’ అంటూ నాలో స్ఫూర్తి నింపారు. నలుగురు అబ్బాయిల్లో నన్నొక అమ్మాయిలా కాకుండా అబ్బాయిలానే చూశారు.
మీ గత రెండు చిత్రాలు.. మీకు మంచి పేరు తెచ్చినా.. మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఆ విషయంలో అసంతృప్తి చెందారా?
అమృత: అలా ఏం లేదు. నా పాత్రపరంగానైతే సంతోషంగానే ఉన్నా. నా వరకూ ది బెస్ట్ ఇచ్చా. భవిష్యత్‌లోనూ ఇలాంటి కథలోనే చేయాలనే పట్టింపులేమీ లేవు. మంచి పాత్ర ఏది వచ్చినా చేసుకుంటూ పోతా. నటిగా నన్ను నేను నిరూపించుకోవడమే ముఖ్యం. ప్రస్తుతానికి మంచి పాత్రలే వస్తున్నాయి. ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినా చేస్తా. గ్లామర్ పాత్రలకైతే ప్రస్తుతానికి సిద్ధంగా లేను.
బాగా సన్నబడ్డారు.. కసరత్తులు బాగా చేస్తారా?
అమృత: సినిమా కోసమని కాదుగానీ, సహజంగానే ఇంట్లో కసరత్తులు చేస్తుంటా. చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్‌లో ఉన్నా. స్కూల్, కాలేజీ రోజుల్లో బాస్కెట్ బాల్ ఆడేదాన్ని. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఫిట్‌నెస్, సినిమా.. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలీక కొద్దిరోజులు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు కాస్త అనుభవం వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నా.
మీ వ్యక్తిగత విషయాలు చెప్పండి..
అమృత: చెన్నైలో పుట్టా. బెంగళూరులో పెరిగా. స్కూల్, కాలేజీ చదువంతా అక్కడే. ఓ ఏడాది కార్పొరేట్ కంపెనీలో పనిచేశా. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్.. ఆపై సినిమాల్లోకి వచ్చా.
తెలుగులో బాగానే మాట్లాడుతున్నారు.. ఎలా సాధ్యం?
అమృత: సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకుంటున్నా. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగా. ‘రెడ్’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. తెలుగులో అల్లు అర్జున్, సమంత అంటే ఇష్టం.
కొత్త కథలేమైనా విన్నారా?
అమృత: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేస్తున్నా. 70 శాతం షూటింగ్ పూర్తైంది. వచ్చే ఏడాది ఆ చిత్రంతో పలకరిస్తా. వెబ్‌సిరీస్‌లు వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను.
ఇది చూడండి: 'బిగిల్' భామ అమృత అందం చూడతరమా!