పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లతో పాటు డెస్క్‌టాప్ వెర్షన్‌కూ కొత్త అప్డేట్లు రాబోతున్నాయి. డిలీట్ చేసిన మెసేజ్‌లను 'అన్డూ' చేయడం సహా నచ్చని స్టేటస్‌లపై ఫిర్యాదు చేసేలా ఆప్షన్లను వాట్సాప్ తీసుకురానున్నట్లు సమాచారం.
వాట్సాప్ స్టేటస్ రిపోర్ట్
వాట్సాప్‌లో మన కాంటాక్టుల్లో అనేక మంది రోజుకు ఎన్నో స్టేటస్లు పెడుతుంటారు. ఫన్నీ వీడియోలు, సినిమా పాటలు, కొటేషన్ల సంగతి ఎలా ఉన్నా.. కొన్ని స్టేటస్లు మనకు నచ్చకపోవచ్చు. అనుచితంగా అనిపించే స్టేటస్‌లపై మనం ఏం చేయలేము. కానీ, ఇకపై అలా కాదు. ఇందుకోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది. ఈ ఆప్షన్ ద్వారా అనుచిత స్టేటస్ గురించి వాట్సాప్ మోడరేషన్ టీమ్‌కు రిపోర్ట్ చేయవచ్చు. అయితే, ఇది తొలుత వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌కే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది.
కొత్త వెరిఫికేషన్..
ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు మరో సెక్యూరిటీ ఫీచర్ పరిచయం కాబోతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు.. మరో డివైజ్‌లో తమ వాట్సాప్ లాగిన్ అవ్వాలంటే ఆరు డిజిట్ల కోడ్ ఎంటర్ చేయడం తప్పనిసరి కానుంది. మరో డివైజ్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో వాట్సాప్.. ఆరు డిజిట్ల కోడ్‌ను మొబైల్ నెంబర్‌కు పంపిస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే లాగిన్ అయ్యేలా ఫీచర్ డెవలప్ చేస్తోంది. అయితే, ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వాడేవారికే ముందుగా అందుబాటులోకి రానుంది.
అందరూ మెచ్చే ఫీచర్ ఇదే..
వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ ఫీచర్ చాలా మందికి ఇష్టమైన ఫీచర్. మెసేజ్‌లో ఏదైనా తప్పులు దొర్లితే వెంటనే సందేశాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, డిలీట్ ఫీచర్లో 'డిలీట్ ఫర్ ఎవ్రివన్', 'డిలీట్ ఫర్ మీ' రెండు ఆప్షన్స్ ఉంటాయి. డిలీట్ ఫర్ ఎవ్రివన్ అంటే.. అందరికీ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అదే డిలీట్ ఫర్ మీ అంటే.. సందేశం పంపినవారికి మాత్రమే అది కనిపించకుండా పోతుంది. అయితే, కొన్నిసార్లు పొరపాటున డిలీట్ ఫర్ మీ కొట్టేస్తాం. ఆ తర్వాత 'డిలీట్ ఫర్ ఎవ్రివన్' ఆప్షన్ ఉపయోగించే అవకాశం పోయినట్టే! ఈ సమస్యను పరిష్కరించేలా వాట్సాప్.. నూతన ఆప్షన్ తీసుకొస్తోంది. 'డిలీట్ ఫర్ మీ'కి అనుబంధంగా 'అన్డూ' ఫీచర్ ప్రవేశపెట్టనుంది. దీని వల్ల.. పొరపాటున డిలీట్ ఫర్ మీ ద్వారా తొలగించిన సందేశాలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగపడుతుందని డెవలపర్లు భావిస్తున్నారు.
స్టేటస్ లిస్ట్‌లు
వాట్సాప్ స్టేటస్‌లకు సంబంధించే మరో ఫీచర్‌పై సంస్థ కసరత్తు చేస్తోంది. వాట్సాప్‌లో మనం ఎన్నో స్టేటస్లు పెడుతూ ఉంటాం. కొన్ని స్టేటస్‌లను కొందరికి కనిపించకుండా పెడుతుంటాం. ఉదాహరణకు, కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లిన విషయం ఇంట్లో తెలియకుండా.. ఫ్రెండ్స్‌కు మాత్రమే తెలియాలని అనుకుంటాం. కానీ, ప్రతిసారి స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం కష్టమే. ఇలాంటి వారికోసమే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. దీన్నిబట్టి.. వాట్సాప్‌లో ముందుగానే జాబితాలను తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ రకరకాల లిస్ట్‌లు ముందుగా సిద్ధం చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టే సమయంలో ఏ లిస్ట్‌ను ఎంపిక చేసుకుంటే.. వారికే ఆ స్టోరీ వెళ్లిపోతుంది. మిగిలినవారు చూడలేరు.
ప్రైవసీని పెంచే వైట్‌లిస్ట్!
ప్రస్తుతం వాట్సాప్‌లో బ్లాక్ లిస్ట్ ఆప్షన్ ఉంది. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కాంటాక్టులు మన ప్రొఫైల్ ఫొటోలు, స్టేటస్ అప్డేట్లను చూడలేరు. అయితే, దీనికి భిన్నంగా వాట్సాప్ ఇప్పుడు.. వైట్‌లిస్ట్ ఆప్షన్ తీసుకురాబోతోంది. వైట్‌లిస్ట్ జాబితాలో ఉన్న కాంటాక్టులు మాత్రమే స్టేటస్ అప్డేట్లు, డీపీలు చూడగలిగేలా ఈ ఆప్షన్‌ను రూపొందిస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీని మరింత పెంచుతుందని వాట్సాప్ భావిస్తోంది.