వాచ్ తయారీ కంపెనీ టైటాన్ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కోసం ఐదు కొత్త వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. టైటాన్ పే ఫీచర్‌తో రానున్న ఈ వాచ్‌ల ద్వారా ఏటీఎం కార్డ్ అవసరం లేకుండా నగదు చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం టైటాన్ ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకుంది. ఈ వాచ్‌లతో పీఓఎస్ మిషన్‌ల వద్ద పిన్ అవసరం లేకుండా రూ. 2,000 వరకు చెల్లించొచ్చు. అంతకు మించి నగదు చెల్లించాలంటే మాత్రం పిన్ ఎంటర్ చేయాలి.
ఐదు వాచ్‌లు..
కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఫీచర్ కోసం సురక్షితమైన నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) చిప్‌ను వాచ్ స్ట్రాప్‌లో ఉంచినట్లు టైటాన్ తెలిపింది. యోనో ఎస్‌బీఐ సాయంతో దుకాణాలు, పీఓఎస్ మెషీన్లు అందుబాటులో ప్రతి చోటా టైటాన్ పే పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి యూజర్స్ తమ ఎస్‌బీఐ ఖాతాతో కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా టైటాన్ పే యాక్టివేట్ అవుతుంది.
ఐదు వాచ్ మోడల్స్‌లో మూడు పురుషుల కోసం, రెండు మహిళల కోసం డిజైన్ చేసినట్లు టైటాన్ తెలిపింది. పురుషుల వాచ్ ధరలు వరుసగా రూ. 2,995, రూ.3,995, రూ.5,995గాను.. మహిళల వాచ్ ధరలు రూ.3,895, రూ.4,395గా కంపెనీ నిర్ణయించింది. గుండ్రటి డయల్ డిజైన్‌తో బ్లాక్, బ్రౌన్ రంగు స్ట్రాప్‌లతో ఈ వాచ్‌లు లభిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఫోన్ నుంచి పొలంలో 'ఇస్మార్ట్ వ్యవసాయం'!