అవకాశాలు మనచుట్టూనే ఉంటాయి. అందిపుచ్చుకున్నవాడే విజేత. ఈ ఛాన్స్‌ని సంపాదనగా మలచుకొని జనాలకు ఉపయోగపడే దారిలో వెళ్తున్నాడు హరికిరణ్. మూడేేళ్ల కిందట తను ఆన్‌లైన్‌లో ఒక ఫోన్ కొనాలనుకున్నాడు. ఆఫర్ల కోసం వెతికాడు. కావాల్సిన సమాచారం దొరకలేదుగానీ ప్రతి వెబ్‌సైట్‌లో యాడ్స్ వరదే. దీంతో వాణిజ్య ప్రకటనలు లేకుండా అన్నిరకాల ఆఫర్లు, డిస్కౌంట్ల సమాచారం తెలిపే వెబ్‌సైట్ నేనే ఎందుకు ప్రారంభించకూడదు.. అనుకున్నాడు. ఆ సమయంలోనే ‘అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్’ గురించి తెలిసింది. www.techglaredeals.com వెబ్‌సైట్(Special website for information on offers and discounts) రూపొందించి, ఆ కార్యక్రమం ద్వారా అమెజాన్ సహా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.
ఏంటి ప్రత్యేకత?
అమెజాన్, మింత్రా సహా పలు ఈ-కామర్స్ సంస్థలు అందించే అన్నిరకాల ఆఫర్లు, రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్ల వివరాలు ముందే హరికి పంపిస్తారు. వీటిని తన వెబ్‌సైట్‌లో ఉంచుతాడు. ఆ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తనకి కొంత కమిషన్ అందుతుంది. సంస్థల వెబ్‌సైట్, యాప్‌లోనే అన్ని ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు అందుబాటులో ఉంచుతారు. మీడియాలో ప్రచారం చేస్తారు. అయినా ఇతర వెబ్‌సైట్లలో వినియోగదారులకు లాభం చేకూర్చేలా ప్రత్యేకంగా, అదనంగా ఏమైనా రాయితీలు ఉంటాయా? అనే సందేహం రాకమానదు ఎవరికైనా. ఇదే విషయం హరికిరణ్‌ని అడిగితే.. ‘ప్రతి ఈ-కామర్స్ సంస్థకి అత్యధిక అమ్మకాలే లక్ష్యం. తమ ప్రయత్నాలు చేస్తూనే ఎక్కువ వెబ్‌సైట్ వీక్షకులు, సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్నవారిని ఆకట్టుకునేలా.. ఆ ఆదరణను అమ్మకాలుగా మలుచుకునేలా భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఈ అఫిలియేట్ వెబ్‌సైట్ నిర్వాహకులను ప్రోత్సహిస్తారు’ అంటాడు తను. హరి వెబ్‌సైట్‌తోపాటు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తుంటాడు. కేవలం సంపాదన ఒక్కటే కాదు.. జనానికి ఉపయోగపడేలా గ్యాడ్జెట్స్, స్మార్ట్‌ఫోన్ల రివ్యూలు, సలహాలు అందుబాటులో ఉంచుతున్నాడు. విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోర్సులు పోస్ట్ చేస్తున్నాడు. రక్తదాతలు, గ్రహీతలకు వారధిగా ఉంటున్నాడు. అత్యవసర వైద్య సాయం అవసరం ఉన్నవాళ్లకి ఫాలోయర్ల ద్వారా విరాళాలు సేకరించి అందిస్తున్నాడు.
మీరూ సంపాదించొచ్చు..
సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు, ఫ్రెండ్స్ ఉన్నవారు ఆ పాపులారిటీని సంపాదనకు మార్గంగా మలచుకోవచ్చు. ‘అఫ్లియేట్ మార్కెటింగ్ ప్రోగ్రాం’ ద్వారా ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ల తరపున ప్రచారం చేస్తూ కాసులు పోగేసుకోవచ్చు. వెబ్‌సైట్, యాప్, ఈమెయిల్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాలను వేదికలా మార్చుకోవచ్చు. కాకపోతే మన వెబ్‌సైట్‌కి మంచి ట్రాఫిక్ ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన వెబ్‌సైట్ ద్వారా కొన్ని సేల్స్ చేయించగలగాలి.
ఇదీ చదవండి: