అచంచల దేశభక్తుడు.. అలుపెరగని పోరాట యోధుడు.. మహాకవి.. విశిష్ట పాత్రికేయుడు.. భాషాప్రాంత వర్ణ వర్గ భేదాలకు అతీతుడైన సమదర్శి.. ఆధ్యాత్మిక చింతన, మానవతావాదం కలగలసిన మహా మనీషి సుబ్రహ్మణ్య భారతి. సెప్టెంబర్ 12న ఆయన శతవర్ధంతి. 1882 డిసెంబర్ 11న తమిళనాడులోని ఎట్టయాపురం (తూత్తుకుడి) గ్రామంలో చిన్నస్వామి అయ్యర్, లక్ష్మీ అమ్మాళ్‌లకు (subramania bharati biography) ఆయన జన్మించారు. చిన్నస్వామి తమిళ పండితుడు, గణితం- ఆధునిక ఇంజినీరింగ్‌లలో పరిజ్ఞానంగలవారు. కుమారుడికి ఆంగ్ల విద్య నేర్పించి ఇంజినీరును చేయాలని అభిలషించేవారు. సుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచి ఆంగ్లవిద్యపై వ్యతిరేక భావం ఉండేది.
బహుభాషా కోవిదుడు
బాలమేధావి అయిన సుబ్రహ్మణ్యం ప్రకృతిని ప్రేమించేవారు. పెద్దవారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు. ఏడేళ్ల వయసులోనే ఆశువుగా కవిత్వం చెప్పేవారు. ప్రసిద్ధ తమిళ కవుల కవిత్వాలను అధ్యయనం చేశారు. ఆయన ప్రతిభను గుర్తించి పదకొండేళ్ల వయసులోనే ఎట్టయాపురం రాజా- 'భారతి' బిరుదు ప్రదానం చేశారు. భారతి విద్యాభ్యాసం తిరునల్వేలి హిందూ పాఠశాలలో జరిగింది. పదిహేనేళ్ల ప్రాయంలో వివాహం జరిగింది. ఉన్నత విద్యాభ్యాసానికి వారణాసి వెళ్లారు. అక్కడ గంగాతీరం కవిగా భారతి పరిణతికి దోహదం చేసింది. వారణాసి, అలహాబాద్‌లో సంస్కృతం, హిందీ అభ్యసించారు. ఆ భాషల్లో ధారాళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదించిన భారతి- తెలుగు, మలయాళం, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, ఫ్రెంచి భాషలూ నేర్చుకున్నారు. ఆయనను బహు భాషా కోవిదుడిగా తమిళ సమాజం గుర్తించింది.
భారతికి ఆంగ్ల కవి షెల్లీ కవిత్వం అంటే ఎనలేని అభిమానం. తనను 'షెల్లీ దాసన్'గా పేర్కొన్నారు. కొంతకాలం ఎట్టయాపురం రాజా కొలువులో, మదురై సేతుపతి పాఠశాలలో తమిళ పండితుడిగా ఉద్యోగం చేసిన తరవాత (subramania bharati biography) తన ప్రవృత్తికి తగిన పత్రికారంగంలోకి ప్రవేశించారు. ప్రసిద్ధ తమిళ పత్రిక 'స్వదేశమిత్రన్' సంపాదకుడు సుబ్రహ్మణ్య అయ్యర్ ఆహ్వానంపై అందులో ఉపసంపాదకుడిగా చేరారు. పాత్రికేయ వృత్తిలో ఉండగానే రాజకీయ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అనేకమంది దేశభక్తులు, ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాలు పెంపొందాయి. సోదరి నివేదితను కలకత్తాలో కలుసుకున్నారు. ఆమె ఉపదేశం భారతి వ్యక్తిత్వాన్ని బలంగా ప్రభావితం చేసింది. 'భారతమాత' అనే పవిత్ర భావన తనలో ఉదయించడానికి ఆమెతో సంభాషణే కారణమంటారాయన.
మహిళా స్వాతంత్య్రం, సాధికారతల గురించి ఆ రోజుల్లోనే భారతి నవ సూత్రాలను ప్రతిపాదించారు. 1907లో సూరత్ కాంగ్రెస్ సభలకు హాజరైన భారతికి అతివాద కాంగ్రెస్ నాయకుడు తిలక్ అంటే ఆరాధనా భావం ఏర్పడింది. తిలక్ ఉపన్యాసాన్ని తమిళంలోకి అనువదించి ముద్రించారు. కాంగ్రెస్‌లోని అతివాదుల మార్గాన్ని సమర్థించిన భారతి- దక్షిణ భారతదేశంలోని ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు చిదంబరం పిళ్లైని అనుసరించేవారు. దేశీయ పత్రికలపై బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
చిదంబరం పిళ్లై అరెస్టు అయ్యాక భారతి ఫ్రెంచి పాలనలోని పుదుచ్చేరి వెళ్ళిపోయి, అక్కడి నుంచి కార్యకలాపాలు సాగించారు. 'ఇండియా' తమిళ వారపత్రిక నడిపారు. స్వరాజ్యోద్యమానికి ఆ పత్రిక ఎంతో దోహదం చేసింది. 'విజయ' పేరుతో తమిళ దినపత్రికను, 'కర్మయోగి' అనే తమిళ మాసపత్రికను, 'బాలభారతం' అనే ఆంగ్ల పత్రికను నడిపారు. పత్రికల్ని దేశంలోకి రహస్యంగా పంపడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. 1918లో పుదుచ్చేరినుంచి తమిళనాడులోకి ప్రవేశించాక ఆయనను నిర్బంధించి కడలూరు కారాగారానికి తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక 1919లో గాంధీజీని కలుసుకున్నారు.
ఉన్నతాదర్శాలకోసం తపన
సుబ్రహ్మణ్య భారతి ప్రతి రచనలోనూ జాతీయ సమైక్యతా భావం వెల్లివిరిసేది. ఆయన రచనల్లో కుయల్పట్టు, పాంచాలీ శపథం, కన్నయ్యపట్టు ప్రధానమైనవి. భారతి కవితల్ని ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ తెలుగులోకి అనువదించారు. 'సింధు నదిని పండు వెన్నెలలో చేర దేశపు వయసు కన్నెలతో తేట తెలుగున పాటపాడుతూ పడవనడిపీ తిరిగివచ్చేము' అన్న భారతి 'సుందర తెలుంగై' అని తెలుగు భాషను ప్రశంసించారు.
'కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు' అనే సమైక్య భావనను మధుర కవితామయం చేశారు. ఎందరో జాతీయ నాయకుల్ని, సంస్కర్త కందుకూరిని, చిత్రకారుడు రవివర్మను, వివేకానందుణ్ని శ్లాఘిస్తూ కవిత్వం రాశారు. వినాయగర్, మురుగన్, కాళి, కన్నయ్య మొదలైన దేవతలపై స్తోత్రాలు రచించారు. కొన్ని వేదమంత్రాలను, పతంజలి యోగసూత్రాలను తమిళంలోకి అనువదించారు. రష్యా, బెల్జియం స్వాతంత్య్రం సంపాదించుకున్నప్పుడు ఆ దేశాల్లోని ఉద్యమాలను ప్రశంసిస్తూ కవితలు రాశారు. ఆయనది విశాలదృక్పథం. 'వందేమాతరం' గీతాన్ని తమిళంలోకి అనువదించారు. 'విద్యాబుద్ధులు నీతి ప్రేమ కలవారే అధికులు', 'కుల భేదాలెంచుట కడుపాపం' వంటి భావాలను ప్రబోధించారు.
సంగీతంలోనూ ప్రవేశం ఉన్న భారతి దేశభక్తి గీతాలు పాడేవారు. కనకలింగం అనే వెనకబడిన వర్గానికి చెందిన బాలుడికి ఉపనయనం జరిపించారు. దళితుల్ని తన ఇంటికి ఆహ్వానించి గౌరవించేవారు. నవయుగ తమిళ ప్రవక్తగా మన్ననలందుకున్న సుబ్రహ్మణ్య భారతి 1921 సెప్టెంబర్ 12న పరమపదించారు. మనుషుల్లో ఉన్నతాదర్శాలకోసం ఆ రోజుల్లోనే తపించిన అభ్యుదయవాది సుబ్రహ్మణ్య భారతి.
- డి.భారతీదేవి
ఇదీ చూడండి : 'గ్లోబల్ టీచర్ ప్రైజ్' రేసులో హైదరాబాదీ